శేరిలింగంపల్లిలో అత్యాధునిక డిజిటల్ లైబ్రరీ.. CSR నిధులతో రోలింగ్ మెడోస్ కాలనీలో నిర్మాణానికి శ్రీకారం

శేరిలింగంప‌ల్లి, జూలై 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రోలింగ్ మెడోస్ కాలనీలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులతో అత్యాధునిక డిజిటల్ లైబ్రరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ చీఫ్ మేనేజర్ జాన్ క్రిస్టోఫర్, సంస్థ ప్రతినిధులు, కాలనీ వాసులతో కలిసి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ డిజిటల్ లైబ్రరీ నిర్మాణానికి ముందుకొచ్చిన హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇండియా సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. CSR నిధులతో అన్ని ఆధునిక సౌకర్యాలు, మౌలిక వసతులతో కూడిన డిజిటల్ లైబ్రరీని నిర్మించి, త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ గ్రంథాలయం కాలనీ వాసులతోపాటు పరిసర ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

సమాజ హితం కోసం సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని, ప్రతి ఒక్కరూ సమాజ అభివృద్ధికి తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా అత్యాధునిక సదుపాయాలతో భవనాన్ని నిర్మించి, అందరికీ ఆమోదయోగ్యమైన విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, వ్యక్తుల్లో మేథోశక్తి, ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని గాంధీ పేర్కొన్నారు. చదివే అలవాటును పెంపొందించడమే కాకుండా, పేద విద్యార్థులు, పుస్తక ప్రియులకు ఉచితంగా విజ్ఞానాన్ని అందించే వేదికలుగా గ్రంథాలయాలు నిలుస్తాయని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో అధ్యయనం చేసేందుకు, చారిత్రక, సాంస్కృతిక విలువలు కలిగిన గ్రంథాలను భవిష్యత్ తరాలకు భద్రపరచేందుకు గ్రంథాలయాలు దోహదపడతాయని వివరించారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రంథాలయాల‌ను కూడా ఆధునికీరించ‌డం జ‌రిగింద‌ని, డిజిటల్ లైబ్రరీలు, ఇంటర్నెట్ సౌకర్యాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పుస్తకాలు, సమాచారాన్ని సులభంగా పొందే అవకాశం కల్పిస్తున్నాయని అన్నారు. విద్యార్థులు, యువత ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇండియా సంస్థ ప్రతినిధులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here