శేరిలింగంపల్లి, జూలై 23 (నమస్తే శేరిలింగంపల్లి): ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ (NEET) పేపర్ లీక్‌ను నిరసిస్తూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువకులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని ఆల్ ఇండియా ఫార్వర్డ్ డెమోక్రటిక్ యూత్ (AIFDY) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ తీవ్రంగా ఖండించింది. జూలై 24న వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. , మియాపూర్ స్టాలిన్ నగర్లో సభ్యులతో కలిసి AIFDY గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ డి. మధుసూదన్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 12.5 సంవత్సరాల్లో సుమారు 150 సార్లు వివిధ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు.

నీట్ పేపర్ లీక్ ఘటనపై బాధ్యత వహించకుండా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం దమనకాండకు పాల్పడటం ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని ఆయన విమర్శించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువజన సంఘాల కార్యకర్తలపై లాఠీచార్జి చేసి వందలాది మందిని గాయపరచడం సిగ్గుచేటని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని AIFDY డిమాండ్ చేసింది. అలాగే విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని కేంద్ర ప్రభుత్వం ఖండించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది. జూలై 24న వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని రాష్ట్రంలోని అన్ని వామపక్ష యువజన, విద్యార్థి సంఘాలకు AIFDY గ్రేటర్ హైదరాబాద్ కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో AIFDY గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గ సభ్యులు ఇస్లావత్ దశరథ్ నాయక్, ఎండి సుల్తానా బేగం, డి. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.





