శేరిలింగంపల్లి, జూలై 23 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజలకు సురక్షితమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఆహార భద్రతా ప్రమాణాల అమలుపై స్విగ్గీ ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించింది. కార్పొరేషన్ జారీ చేసిన నోటీసులకు స్పందనగా హెల్త్ అండ్ శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో సేవలు అందిస్తున్న ఆహార వ్యాపార సంస్థలు చట్టబద్ధ నిబంధనలను కచ్చితంగా పాటించేలా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు స్విగ్గీ ప్రతినిధులతో చర్చించారు. అలాగే కార్పొరేషన్-స్విగ్గీ మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం, వినియోగదారుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది.

స్విగ్గీ తన ప్లాట్ఫామ్లో నమోదయ్యే అన్ని ఆహార వ్యాపార సంస్థలకు FSSAI లైసెన్స్‌తో పాటు చెల్లుబాటు అయ్యే ట్రేడ్ లైసెన్స్‌ను తప్పనిసరి చేయడానికి అంగీకరించింది. అలాగే కార్పొరేషన్‌తో సమన్వయం కోసం ప్రత్యేక నోడల్ అధికారిని నియమించనున్నట్లు వెల్లడించింది. అదేవిధంగా ఆన్‌బోర్డింగ్ ఏజెన్సీలు, ఆహార వ్యాపార సంస్థల కోసం ప్రామాణిక నిర్వహణ విధానాలు (SOPs) రూపొందించి అమలు చేయడంతో పాటు, FSSAI లైసెన్సులు పొందేందుకు అవసరమైన మార్గదర్శకాలను అందించేందుకు కూడా స్విగ్గీ అంగీకరించింది. ప్లాట్ఫామ్లో ఉన్న క్లౌడ్ కిచెన్లు, ఇతర ఆహార విక్రయ కేంద్రాలు అన్ని చట్టబద్ధ నిబంధనలు పాటిస్తున్నాయో లేదో కఠినంగా ధ్రువీకరిస్తామని తెలిపింది.
ప్రజారోగ్య పరిరక్షణ, ఆహార భద్రతను నిర్ధారించడం తమ అత్యున్నత ప్రాధాన్యత అని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఆహార భద్రతా ప్రమాణాల అమలు, పరిశుభ్రమైన ఆహార పద్ధతుల ప్రోత్సాహం, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు, ఆహార వ్యాపార సంస్థలతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తూ చర్యలు కొనసాగిస్తామని వెల్లడించింది.

సైబరాబాద్‌లో వంతెనలు, ఫ్లైఓవర్ల భద్రతకు హైటెక్ పర్యవేక్షణ..
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలోని వంతెనలు, ఫ్లైఓవర్ల నిర్మాణ భద్రతను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు అధునాతన సాంకేతిక వ్యవస్థ అమలుపై కీలక చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా Continuous Structural Health Monitoring (CSHM) వ్యవస్థ అమలుపై SentinelIQ, IIIT హైదరాబాద్ ప్రతినిధులతో సీఎంసీ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో అధునాతన సెన్సార్ ఆధారిత సాంకేతికత, డేటా అనలిటిక్స్ వినియోగంతో వంతెనలు, ఫ్లైఓవర్ల నిర్మాణ స్థితిని నిరంతరం పర్యవేక్షించడం, వాటి మిగిలిన సేవా కాలాన్ని అంచనా వేయడం, నిర్మాణాల వృద్ధాప్యాన్ని విశ్లేషించడం, శాస్త్రీయ నిర్మాణ తనిఖీ విధానాలను అభివృద్ధి చేయడంపై విస్తృతంగా చర్చించారు.
రియల్‌టైమ్ మానిటరింగ్ ద్వారా నిర్మాణాల్లో ఏర్పడే మార్పులను ప్రారంభ దశలోనే గుర్తించి, అవసరమైన నిర్వహణ, మరమ్మత్తు చర్యలను సకాలంలో చేపట్టే అవకాశంపై అధికారులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ విధానం ప్రజా భద్రతను మరింత బలోపేతం చేయడంతోపాటు, మౌలిక సదుపాయాల నిర్వహణలో సమాచార ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎంసీ కమిషనర్ సృజన మాట్లాడుతూ నగర మౌలిక సదుపాయాల నిర్వహణలో ఆధునిక సాంకేతికత వినియోగం కాలానుగుణ అవసరమని పేర్కొన్నారు. వంతెనలు, ఫ్లైఓవర్ల భద్రత, మన్నిక, దీర్ఘకాలిక నిర్వహణను మెరుగుపరచడంలో ఇలాంటి సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. సమావేశంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ అధికారులు, SentinelIQ, IIIT హైదరాబాద్ ప్రతినిధులు పాల్గొన్నారు.





