వర్షాకాల వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి.. చిన్న జాగ్రత్తలతోనే ఆరోగ్య రక్షణ: డాక్టర్ సుధాకర్ బండారి

శేరిలింగంప‌ల్లి, జూలై 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వర్షాకాలంలో వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి నివారణ చర్యలు పాటించాలని రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్ బండారి సూచించారు. వ్యాధికి చికిత్సకన్నా నివారణే మిన్న. ఇలాంటి అవగాహన కరపత్రాలు ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంచుతాయి అని అన్నారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, వాటి లక్షణాలు, నివారణ చర్యలపై రూపొందించిన అవగాహన కరపత్రాన్ని బుధవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్ బండారి మాట్లాడుతూ వర్షాకాలంలో అతిసారం, డెంగ్యూ, మలేరియా, మెదడువాపు వంటి సీజనల్ వ్యాధులతోపాటు కోవిడ్ వేరియంట్లు కూడా విజృంభించే అవకాశముందని తెలిపారు. ఆరోగ్యంగా ఉంటేనే జీవిత లక్ష్యాలను సాధించగలమని పేర్కొన్నారు.

సరైన సమయంలో ఆహారం తీసుకోవడం, వీలైనంత వరకు బయట ఆహారాన్ని నివారించడం, ఆహారాన్ని బాగా ఉడికించి వేడిగానే తీసుకోవడం, పరిశుభ్రమైన నీటిని కాచి చల్లార్చి తాగడం, భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఇంటి పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అలాగే నిత్యం వ్యాయామం, నడక, యోగా, ధ్యానం చేయడంతో పాటు పౌష్టికాహారం, తృణధాన్యాలు, పీచు పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలని, బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం మంచిదని సూచించారు. అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంఓ డాక్టర్ విజయకుమారి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తాటిచర్ల వరలక్ష్మి, జి.వి. రావు, పాలం శ్రీను, కొక్కుల జనార్దన్, విష్ణుప్రసాద్, అనూష, కొవ్వూరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here