శేరిలింగంపల్లి, జూలై 22 (నమస్తే శేరిలింగంపల్లి): భువనగిరి, నకిరేకల్ నియోజకవర్గాల రైతుల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ వలిగొండ మండలం ధర్మారెడ్డి కాలువ జీరో పాయింట్ నుంచి దిగువ ప్రాంతాలకు సాగునీటిని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేముల వీరేశం మాట్లాడుతూ భువనగిరి, నకిరేకల్ నియోజకవర్గాల ప్రజల చిరకాల ఆకాంక్ష ధర్మారెడ్డి కాలువ ద్వారా సాగునీరు విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతంలో పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కాలువ పనులను వేగవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాలువల ఆధునీకరణ చేపట్టి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ధర్మారెడ్డి కాలువ పనులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేశామని అన్నారు. గతంలో నీళ్లు, నిధుల కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రస్తుతం కాలువ పూర్తవడంతో వేలాది ఎకరాలకు సాగునీరు అందే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆయన పేర్కొన్నారు.





