శేరిలింగంపల్లి, జూలై 22 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారం చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనులపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీ శ్రీనివాస్, హైడ్రా ఇన్‌స్పెక్టర్ యూనస్‌తోపాటు హైడ్రా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ గంగారం చెరువు సుందరీకరణ పనులను పక్కా ప్రణాళికతో చేపట్టి, అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. చెరువులో కలుషిత నీరు చేరకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, చెరువు చుట్టూ మురుగునీటి మళ్లింపు (UGD) పైప్‌లైన్ ఏర్పాటు చేసి, మురుగునీటి శుద్ధి కోసం ఎస్‌టీపీ (STP) నిర్మిస్తామని తెలిపారు. అలాగే చెరువు కట్ట బలోపేతం, అలుగు మరమ్మత్తులు, పునరుద్ధరణ, వాకింగ్ ట్రాక్, రక్షణ కంచె (ఫెన్సింగ్) నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపడతామని వెల్లడించారు.

నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు సూచించారు. గంగారం చెరువును సుందరవనంగా తీర్చిదిద్ది ప్రజలకు ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యమని చెప్పారు. చెరువులో తామర పువ్వుల పెంపకానికి చర్యలు తీసుకుంటామని, చెరువులు కలుషితం కాకుండా, కబ్జాలకు గురికాకుండా పూర్తి స్థాయిలో సంరక్షిస్తామని పేర్కొన్నారు. గంగారం చెరువుతో పాటు నియోజకవర్గంలోని అన్ని చెరువులను దశలవారీగా సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని గాంధీ తెలిపారు.





