శేరిలింగంపల్లి, జూలై 20 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీపై తెలంగాణ విద్యాశాఖ తీసుకున్న నిర్ణయాన్ని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (USFI) తెలంగాణ రాష్ట్ర కమిటీ స్వాగతించింది. ఈ నెల 30వ తేదీలోపు అన్ని ప్రైవేట్ పాఠశాలలు తమ ఆడిట్ నివేదికలు, ఫీజుల వివరాలను పాఠశాలల నోటీస్ బోర్డులో తప్పనిసరిగా ప్రదర్శించాలని విద్యాశాఖ ఆదేశించడం సరైన నిర్ణయమని పేర్కొంది. ఈ సందర్భంగా USFI రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి, రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి మాట్లాడుతూ.. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ తమ సంఘం ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నిర్వహించామని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం, విద్యాశాఖ తీసుకున్న తాజా నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రులకు ఊరటనిచ్చేదిగా ఉందన్నారు.

అయితే ఈ నిర్ణయం కేవలం ఉత్తర్వులకే పరిమితం కాకుండా పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమిళనాడు ప్రభుత్వం తరహాలో కఠినంగా అమలు చేసి ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరారు. అలాగే ఈ అంశంలో ప్రభుత్వం ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. జూనియర్ కళాశాలల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీపై చర్యలు తీసుకోవాలని, తప్పుడు ర్యాంకులతో ప్రచారం చేస్తున్న కళాశాలల యాజమాన్యాలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో లేని NEET ఫలితాలను తమవిగా ప్రచారం చేస్తున్న శ్రీ చైతన్య, నారాయణ కార్పొరేట్ విద్యాసంస్థల ప్రకటనలపై ఇంటర్ బోర్డు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని USFI తెలంగాణ రాష్ట్ర కమిటీ హెచ్చరించింది.





