శేరిలింగంపల్లి, జూలై 20 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పౌరుల నుంచి మొత్తం 37 ఫిర్యాదులు స్వీకరించి నమోదు చేశారు. అందిన ఫిర్యాదుల్లో టౌన్ ప్లానింగ్ శాఖకు సంబంధించినవే అత్యధికంగా 28 ఉండగా, ఇంజినీరింగ్ శాఖకు 4, రెవెన్యూ (ఆస్తి పన్ను) శాఖకు 2, చెరువులు, అర్బన్ బయోడైవర్సిటీ, పశువైద్య శాఖలకు ఒక్కో ఫిర్యాదు అందింది. అందిన వినతులను సంబంధిత శాఖాధిపతులు పరిశీలించి, వాటిని సంబంధిత అధికారులకు పంపిస్తూ నిర్ణీత గడువులో పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రతి ఫిర్యాదును ప్రత్యేక గ్రీవెన్స్ ఐడీ (Grievance ID)తో నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఫిర్యాదుదారులు తమ వినతుల పురోగతిని గ్రీవెన్స్ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.





