శేరిలింగంపల్లి, జూలై 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చెరువుల సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనుల పురోగతిపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు.

చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా డ్రైనేజీ మళ్లింపు (UGD Diversion) పైప్‌లైన్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ఇన్‌లెట్, ఔట్‌లెట్‌లను సక్రమంగా అభివృద్ధి చేసి వరద నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువుల చుట్టూ జరుగుతున్న ఫెన్సింగ్ పనులు, చెరువు కట్ట బలోపేతం, అలుగు మరమ్మత్తులు, పునరుద్ధరణ పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని సూచించారు. చెరువులను ప్రజలకు ఆహ్లాదకరమైన విహార కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని, వాకర్స్ కోసం వాకింగ్ ట్రాక్‌లు, అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని గాంధీ తెలిపారు. చుట్టుపక్కల కాలనీల నుంచి వచ్చే మురుగునీరు చెరువుల్లో కలవకుండా ప్రత్యేక చర్యలు తీసుకుని, చెరువులను కలుషితం కాకుండా పరిరక్షిస్తామని చెప్పారు. అదేవిధంగా చెరువులపై కబ్జాలు జరగకుండా పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపడతామని, నియోజకవర్గంలోని అన్ని చెరువులను దశలవారీగా సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ప్రజల అవసరాలు, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ శాఖ అధికారులు డీఈ ఉదయ్ భాస్కర్, ఏఈ రవికుమార్, ఏఈ లింగప్ప తదితరులు పాల్గొన్నారు.





