శేరిలింగంపల్లి, జూలై 18 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఆధ్వర్యంలో దివ్య వస్తువుల సేకరణ కార్యక్రమాన్ని శనివారం ఉదయం కార్పొరేషన్ పరిధిలోని ఐదు దేవాలయాల్లో నిర్వహించారు. ఉదయం 8:30 నుంచి 11:00 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమాన్ని సాంప్రదాయ పూజలతో ప్రారంభించారు. అనంతరం భక్తులు స్వచ్ఛందంగా విగ్రహాలు, దేవతల ఫోటో ఫ్రేములు, పాత క్యాలెండర్లు తదితర ఉపయోగించిన దివ్య వస్తువులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సేకరణ కేంద్రాల్లో అందజేశారు. సేకరించిన దివ్య వస్తువులను శాస్త్రీయంగా వేరు చేసి, పర్యావరణహిత విధానాల ద్వారా రీసైక్లింగ్‌తోపాటు తగిన నిర్వహణ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

దివ్య వస్తువులను గౌరవప్రదంగా సేకరించి, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం ద్వారా పర్యావరణహిత వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన దేవాలయ నిర్వహణ కమిటీలు, భక్తులు, వాలంటీర్లు, అలాగే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య సిబ్బందికి అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.





