శేరిలింగంపల్లి, జూలై 15 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన బోర్డు సభ్యురాలిగా పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ నియామకంపై యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బీసీ, యాదవ్ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈశ్వరమ్మ యాదవ్కు క్షమాపణ చెప్పడంతోపాటు శివచరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు బేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బీసీ, యాదవ్ సంఘాల నాయకులు సమావేశమై నిరసన తెలిపారు. బీసీ వర్గానికి చెందిన మహిళకు దేవస్థాన బోర్డు సభ్యురాలిగా అవకాశం రావడాన్ని జీర్ణించుకోలేక అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఘటనను ఖండించాలని, శివచరణ్ రెడ్డిపై పార్టీ పరంగా చర్యలు తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పేలా చూడాలని వారు కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా యాదవులు, బీసీ సంఘాల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మండలి రాధాకృష్ణ యాదవ్, రాయదుర్గం యాదవ సంఘం యువజన అధ్యక్షుడు నాగపురి అశోక్ యాదవ్, వంగూరి సందీప్ యాదవ్, గౌడ సంఘం నాయకుడు రాజు గౌడ్, కృష్ణ ముదిరాజ్, నాయి బ్రాహ్మణ సంఘానికి చెందిన సాయిలు, పద్మశాలి రమేష్, రజక సంఘం నాయకుడు కిషోర్, జాతీయ భవన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంతయ్యతోపాటు పలువురు బీసీ, యాదవ్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.





