శేరిలింగంపల్లి, జూలై 15 (నమస్తే శేరిలింగంపల్లి): స్పెషల్ సమ్మరీ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని వేగవంతం చేసే లక్ష్యంతో శేరిలింగంపల్లి నియోజకవర్గం ERO నారాయణ్ అమిత్, అలాగే ERO/ZC, SIR నోడల్ అధికారులు జోన్ పరిధిలోని పలు కాలనీల్లో ఆకస్మిక క్షేత్ర తనిఖీలు నిర్వహించారు. ఓటరు నమోదు ప్రక్రియలో ఫారం పంపిణీ, దరఖాస్తుల డిజిటలైజేషన్, ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తనిఖీల సందర్భంగా ఇంటింటికీ ఓటరు నమోదు ఫారాల పంపిణీ జరుగుతున్న తీరును పరిశీలించారు. అలాగే సేకరించిన దరఖాస్తులను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక డిజిటలైజేషన్ కౌంటర్ల పనితీరును సమీక్షించారు. ఓటరు జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో ప్రజలు తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, డిజిటలైజేషన్ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలని ERO/ZC అధికారులను నారాయణ్ అమిత్ ఆదేశించారు. ఈ క్షేత్ర పరిశీలనలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్, ERO/ZC, SIR నోడల్ అధికారులు పాల్గొన్నారు. పాపిరెడ్డినగర్, శేరిలింగంపల్లి, అంజయ్యనగర్, ప్రేమ్‌నగర్, న్యూ హఫీజ్‌పేట్, ఆదర్శ్‌నగర్, గుల్మోహర్ పార్క్ కాలనీ ప్రాంతాలన్నింటిలోనూ జోనల్ కమిషనర్, ERO ఆధ్వర్యంలో SIR కార్యక్రమం పురోగతిని సమీక్షించి, ఓటరు నమోదు ప్రక్రియను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచనలు చేశారు.





