ప్రేమ్ నగర్‌లో డ్రైనేజ్ సమస్యలపై రవికుమార్ యాదవ్ పర్యటన

శేరిలింగంప‌ల్లి, జూలై 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి-బ్లాక్ కాలనీలో నెలకొన్న డ్రైనేజ్, నాలా సమస్యలను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్ పరిశీలించారు. స్థానికుల ఫిర్యాదుల మేరకు కాలనీలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం నాలా మార్గాన్ని మళ్లించడంతో డ్రైనేజ్ నీరు రోజువారీ వినియోగానికి ఉపయోగించే బోర్‌వెల్ నీటిలో కలుస్తోందని, దీంతో చిన్నారులు, పెద్దలు జ్వరాలు, చర్మవ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. అలాగే ప్రేమ్ నగర్ ఏ-బ్లాక్ నుంచి వచ్చే నాలా సామర్థ్యం తక్కువగా ఉండటం, పూడికతీతలు చేపట్టకపోవడం వల్ల స్వల్ప వర్షానికే నాలా పొంగిపొర్లి డ్రైనేజ్ నీరు రోడ్లపైకి, ఇళ్లలోకి చేరుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో కూకట్‌పల్లి వైపు వెళ్లే నాలాను ప్రేమ్ నగర్ వైపు మళ్లించడం వల్ల డ్రైనేజ్ నీటి ప్రవాహానికి సరైన మార్గం లేక సమస్యలు తీవ్రమయ్యాయని అన్నారు. కలుషితమైన బోర్‌వెల్ నీటి కారణంగా ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రేమ్ నగర్ ఏ-బ్లాక్ వద్ద నాలా విస్తరణ, పూడికతీతలు చేపట్టడం వంటి చర్యలు అవసరమని పేర్కొన్న ఆయన, ఈ సమస్యలను ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సంబంధిత అధికారులతో చర్చించి శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో రాజు, రామిరెడ్డి, శంకర్, శ్రీకాంత్, కుమార్, రహమతుల్లా, బాలాజీ, విజయ్, పరమేశ్వర్, నాగమ్మ, పార్వతి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here