శేరిలింగంపల్లి, జూలై 15 (నమస్తే శేరిలింగంపల్లి): ఎస్ఐఆర్ (Special Intensive Revision) కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ పీజేఆర్ నగర్ కాలనీలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ చాముండేశ్వరి, మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి సంతకం చేసి బీఎల్వోకు అందజేయాలని సూచించారు. ఫారం సమర్పించినప్పుడే ఓటరు నమోదు ప్రక్రియ పూర్తవుతుందని, ఎలాంటి సందేహాలున్నా బూత్ లెవల్ అధికారులను సంప్రదించాలని కోరారు.

ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు అని పేర్కొన్న ఆయన, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు. జూలై 24 వరకు మాత్రమే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఎస్ఐఆర్ కార్యక్రమంలో పాల్గొని తమ ఓటు హక్కును కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. పేద, మధ్యతరగతి ప్రాంతాల్లో ప్రజలు పెద్దఎత్తున స్పందిస్తున్నప్పటికీ ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మరోవైపు హైరైజ్ అపార్ట్మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీల్లోకి బీఎల్వోలకు ప్రవేశం లభించకపోవడం వల్ల సర్వేలో ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ప్రజాప్రతినిధులు, యువత, కాలనీ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, సోషల్ వర్కర్లు కలిసి అవగాహన కల్పించాలని కోరారు.
ఇళ్లకు పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను నింపి తిరిగి బీఎల్వోలకు ఇవ్వకపోతే ఓటరు జాబితాలో పేరు నమోదు కాదని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల విషయంలో కూడా ఓటరు నమోదు ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉందని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కలెక్టర్, జోనల్ కమిషనర్లు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్నారని, ప్రజలు కూడా సహకరించి ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎస్ఐఆర్ తర్వాత నమోదు చేసుకోవడం కష్టసాధ్యమవుతుందని, ప్రస్తుతం పాత ఓటరు వివరాలతో ఫారం నింపి నమోదు చేసుకోవడం సులభమని చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాలో పేరు ఉన్న ప్రతి ఒక్కరికీ ఎన్యుమరేషన్ ఫారం అందజేస్తారని, ఫారం తిరిగి బీఎల్వోకు ఇచ్చినవారికే ముసాయిదా ఓటరు జాబితాలో పేరు ఉంటుందని వివరించారు.
బీఎల్వోలు ప్రతి ఇంటికి మూడుసార్లు వచ్చి ఫారాలను సేకరిస్తారని, ఫారం సమర్పించే సమయంలో ఎలాంటి పత్రాలు జత చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే, ముసాయిదా జాబితా విడుదల అనంతరం ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేస్తే, ప్రభుత్వం గుర్తించిన గుర్తింపు పత్రాలు సమర్పించి అర్హత నిరూపించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఫారం సమర్పించే ముందు తాజా ఫోటో, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, సంతకం వంటి అంశాలు తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. ఫారం సమర్పించిన తర్వాత బీఎల్వో నుంచి అక్నాలెడ్జ్మెంట్ రసీదు తీసుకోవడంతో పాటు సమర్పించిన ఫారం, జత చేసిన పత్రాల ప్రతులను భద్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఎల్వోలు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.





