శేరిలింగంపల్లి, జూలై 12 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, శేరిలింగంపల్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ERO) నారాయణ్ అమిత్ లు ఆదివారం శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతున్న SIR-2026 (Special Intensive Revision) కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా గణన ప్రక్రియపై సమగ్రంగా సమీక్ష నిర్వహించిన అధికారులు, గణనలో కచ్చితత్వంతోపాటు నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఫీల్డ్ స్థాయిలో సమన్వయంతో మిగిలిన పనులను వేగవంతం చేసి SIR-2026 ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

పర్యటనలో భాగంగా అధికారులు గుల్మోహర్ కాలనీ, మై హోమ్ మంగళ అపార్ట్‌మెంట్‌లను సందర్శించి అక్కడ జరుగుతున్న గణన ప్రక్రియను పరిశీలించారు. బూత్ స్థాయిలో చేపడుతున్న పనితీరును తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మహిపాల్ రెడ్డి, ఉప కమిషనర్, AERO ప్రేమ్ కుమార్, బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు), సూపర్వైజర్లు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.





