ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి న్యూ కాలనీ మార్కెట్ క‌మిటీ కృత‌జ్ఞ‌త‌లు

శేరిలింగంప‌ల్లి, జూలై 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ న్యూ కాలనీలో మంగళవారం సంత (కూరగాయల మార్కెట్) ఏర్పాటుకు సహకరించిన స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డితో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్‌ను మార్కెట్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో చర్చించి మియాపూర్ న్యూ కాలనీలో కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు సహకరించినందుకు మార్కెట్ కమిటీ సభ్యులు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవికుమార్ యాదవ్‌లను ఆహ్వానించి శాలువాలతో సత్కరించారు. పేద ప్రజలకు అండగా నిలిచి మార్కెట్ ఏర్పాటుకు చొరవ చూపినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మార్కెట్ నిర్వహణలో ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, దళారులు లేదా కబ్జాదారులకు భయపడకుండా వ్యాపారులు నిశ్చింతగా మార్కెట్ నిర్వహించుకోవచ్చని భరోసా ఇచ్చారు. అవసరమైతే పార్లమెంటులో ఈ అంశాన్ని ప్రస్తావించి, ఈ స్థలాన్ని మోడల్ మార్కెట్ యార్డు కింద మంజూరు చేయించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పేద ప్రజల తరఫున అధికారులతో చర్చించి మార్కెట్ నిర్వహణకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అధికారిక అనుమతులు వచ్చేలా కృషి చేసిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి, అలాగే సహకరించిన భారతీయ జనతా పార్టీ నాయకులకు రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్ మార్కెట్ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యుడు ఖాజా బాషా, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు మహేష్ యాదవ్, అడ్వకేట్ కిషోర్ యాదవ్, లక్ష్మణ్ ముదిరాజ్, గణేష్ ముదిరాజ్, పవన్ యాదవ్, నాగులు, పట్టాభిరామ్, శివ భాష, రాము తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here