- ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీలో చిత్ర విచిత్రాలు…
- లేని అంతస్తులకు… రద్దయిన భవనాలకు… అప్పనంగా ఆక్యుపెన్సీలు…
- నిబంధనలతో పనిలేదు… అనుమతులతో సంబంధం లేదు…
- అక్రమార్జనకు అలవాటు పడిన అవినీతి అధికారి…
- శేరిలింగంపల్లి సర్కిల్ లోనే తిరిగి తిష్ట వేసేందుకు యత్నం…
నమస్తే శేరిలింగంపల్లి, జూలై 8 (వినయకుమార్ పుట్ట): చట్టాలు సామాన్యులకే కానీ డబ్బున్న వాళ్లకు కాదని మరోసారి రుజువు చేశారు టౌన్ ప్లానింగ్ అధికారులు. నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను బడా బాబుల దగ్గర డబ్బులు దండుకొని ఇష్టారాజ్యంగా ఇచ్చేస్తున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శేరిలింగంపల్లి సర్కిల్ 49లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు అంగట్లో సరుకులా మారిపోయాయి. నిబంధనలు పాటించలేరని ఏళ్ల క్రితం రిజెక్ట్ అయిన భవనాలకు తిరిగి ఓసీలు మంజూరు చేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. నిజానికి భవన నిర్మాణ అనుమతులు కానీ, ఓసీలు కానీ G.O.Ms.No.168, MA dt:07.04.2012 అదేవిధంగా HMC Act 1955 లను పరిగణలోకి తీసుకొని జారీ చేస్తారు. శేరిలింగంపల్లి సర్కిల్ లో మాత్రం ఇక్కడ అవినీతి అధికారుల చేతివాటంతో ఆక్యుఫెన్సీ సర్టిఫికెట్లకు అసలు విలువే లేకుండా పోయింది. ఇక్కడ జరుగుతున్న ఓసీల దందాపై “నమస్తే శేరీలింగంపల్లి” స్పెషల్ ఫోకస్…

2017 భవనానికి అప్పుడు OC రిజెక్ట్… ఇప్పుడు రిలీజ్…
టెలికం నగర్ ప్లాట్ నెంబర్ 279 స్థలానికి 2017 లో స్టిల్ట్ + 3 అనుమతి ఇచ్చారు. పర్మిషన్ లోని నిబంధనల ప్రకారం 2023 ఫిబ్రవరి 6వ తేదీ లోపు భవన నిర్మాణం పూర్తిచేయలి. ఒక రోజు ముందు అంటే 05/02/2023 నాటికే భవన నిర్మాణం పూర్తయింది అంటూ నిర్మాణదారుడు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నాటి టౌన్ ప్లానింగ్ అధికారులు భవనాన్ని పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా అంటే 10% కంటే అధికంగా డివియేషన్ చేసి నిర్మాణం చేశారని, అదేవిధంగా 9 మీటర్లుగా ఉండాల్సిన రోడ్డు స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మించారని ఓసి రద్దు చేశారు. సదరు భవనానికి తాజాగా సరికొత్త బిల్డ్ నౌ విధానంలో తిరిగి OC ఎలా రిలీజ్ చేశారో అర్థం కావడం లేదు. 10% కంటే అధికంగా డివియేషన్, రోడ్డును ఆక్రమించారని అధికారికంగా ఓసి రద్దు లేఖలో పేర్కొన్నప్పటికీ తిరిగి ఓసి ఇచ్చారంటే ఇక్కడ ఎంత పెద్ద మొత్తంలో ముడుపులు చేతులు మల్లాయో అర్థం చేసుకోవచ్చు.

అసలు లేని అంతస్తుకు ఆక్యుపెన్సీ జారీ…
గుల్ మోహర్ పార్క్ కాలనీ ప్లాట్ నెంబర్ 465 లోని స్థలానికి 2021లో G + 1 అనుమతి జారీచేశారు. నిర్మాణదారుడు నిబంధనలకు అనుగుణంగానే G + 1 భవనం నిర్మించారు. అయితే ఇక్కడ కనివిని ఎరుగని విడ్డూరం జరిగింది. ఇక్కడ లేని అంతస్తుకు అంటే ఈ భవనంలోని రెండో అంతస్తును కలుపుకొని ఆక్యుపెన్సి సర్టిఫికెట్ జారీ చేశారు. G + 1 మాత్రమే అనుమతి, అందుకు తగ్గట్టుగానే నిర్మాణం చేపట్టిన భవనానికి రెండవ అంతస్తును కలిపి ఓసి జారీ చేశారంటే.. భవిష్యత్తులో ఆ రెండవ అంతస్తుకు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి మార్టిగేజ్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. అధికారి తలుచుకుంటే లేని అంతస్తుకు సైతం ఆక్యుపెన్సీ ఇవ్వచ్చు అనేది ఇక్కడ తేటతెల్లమవుతుంది.
అనుమతి వచ్చిన రోజే… ఆక్యుపెన్సీ రద్దు…
నల్లగండ్ల హూడ ప్లాట్ నెంబర్ 159లోని స్థలానికి 2022 జూలై 18న గ్రౌండ్ + 2 అనుమతి(Work Commencement Letter) ఇచ్చారు. పర్మిషన్ లోని నిబంధనల ప్రకారం 2023 జనవరి 1 లోపు నిర్మాణం ప్రారంభించి, 2025 జూలై 18వ తేదీ లోపు భవన నిర్మాణం పూర్తిచేయలి. ఐతే విచిత్రం ఏమిటంటే అనుమతి జారీ అయిన రోజే అక్యూపెన్సీ సర్టిఫికెట్ రిజెక్ట్ అయింది. అంటే అనుమతుల కంటే ముందే భవన నిర్మాణం పూర్తయిందనేది ఇక్కడి పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. ఈ క్రమంలోనే నాటి టౌన్ ప్లానింగ్ అధికారులు సదరు భవనానికి OC రిజెక్ట్ చేశారు. నాలుగేళ్ల క్రితం ఓసి రద్దయిన ఈ భవనానికి 2025 జూన్ 30న భవనం పూర్తయిందని నిర్మాణదారుడు మరలా దరఖాస్తు చేసుకోవడం విడ్డూరం. దరఖాస్తు వచ్చిన సంవత్సరం తర్వాత ఇప్పుడు తిరిగి OC రిలీజ్ చేయడం మరో విడ్డూరం. అనుమతుల కంటే ముందే ఆక్యుపెన్సీకి దరఖాస్తు చేసుకున్న నిర్మాణదారుడుకి ఇంత కాలానికి బేషరతుగా ఓసీ జారీ చేశారంటే ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారుల చిత్తశుద్ధి ఏ పాటితో తెలిసిపోతుంది.
ఆ అధికారి అనుకుంటే చాలు…
శేరిలింగంపల్లి 49 సర్కిల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీలో ఇలాంటి చిత్ర విచిత్రాలు కోకొల్లలు. ఇక్కడ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉన్నత స్థానంలో విధులు నిర్వహించిన ఓ అధికారి పెద్ద సంఖ్యలో ఓసీల జారీలో అవినీతికి పాల్పడినట్లు తెలుస్తుంది. అదేవిధంగా తను జారీచేసిన అనుమతుల్లోనూ భారీ అవకతవకలకు పాల్పడినట్లు ఏకంగా అవినీతి నిరోధక శాఖ అధికారులే ఇటీవల గుర్తించి సదరు అధికారి జారీచేసిన అనుమతులపై పునః పరిశీలన జరపాలంటూ ఏకంగా ప్రభుత్వానికే సూచించడం విడ్డూరం. అయితే గత కొంతకాలంగా లాంగ్ లీవ్ లో ఉన్న సదరు అధికారి ఇటీవలే తిరిగి విధుల్లో చేరాడు. శేరిలింగంపల్లి సర్కిల్లో తన అవినీతి పర్వం కొనసాగించేందుకు ఇక్కడే సీట్ కేటాయించాలంటూ పైరవి చేసుకుంటున్నట్టు వినికిడి. ఈసారి గనుక అతడికి శేరిలింగంపల్లి సర్కిల్ లో స్థానం దక్కితే అసలు ఆక్యుపెన్సి సర్టిఫికెట్ల అర్ధాన్నే మార్చేస్తాడు అనడంలో అతిశయోక్తి లేదు.





