శేరిలింగంపల్లి, జూలై 4 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రేమ్‌నగర్ ఎ బ్లాక్ పరిధిలోని 319వ పోలింగ్ బూత్‌ను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్చార్జి రవికుమార్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా బీఎల్‌ఓతోపాటు బీజేపీ బీఎల్ఏ-2 ప్రతినిధులతో కలిసి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫామ్‌లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో బీఎల్ఓలు అన్ని రాజకీయ పార్టీల బీఎల్ఏలతో సమన్వయం చేసుకుని ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేయాలని సూచించారు.

ఫారాలను పూర్తి చేసిన అనంతరం సంబంధిత ప్రభుత్వ గుర్తింపు పత్రాల ప్రతులతో కలిసి బీఎల్ఓలకు తిరిగి అందజేయాలని ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. కొంతమంది బీఎల్ఓలు ఒకే ప్రాంతంలో ఉండి ఫారాలు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని, అలాంటి విధానం సరైనది కాదన్నారు. ప్రతి ఇంటిని సందర్శించినప్పుడే నిజమైన అర్హులైన ఓటర్లను గుర్తించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతోపాటు దొంగ, డూప్లికేట్ ఓట్లను తొలగించేందుకు ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన అన్నారు. అలాగే ప్రతి రోజు ఎన్ని ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారో, ఎన్ని పూర్తి చేసిన ఫారాలు స్వీకరించారో, ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తులు ఎన్ని వచ్చాయో బీఎల్ఓల వద్ద నుంచి వివరాలు సేకరించి పార్టీ నాయకత్వానికి తెలియజేయాలని బీజేపీ బీఎల్ఏ-2 ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఓ, అంగన్వాడీ టీచర్ శైలజ, బాలాజీ రావు, రాహుల్, గోవింద్రాజ్, విశాల్, మారెప్ప, అంజలి తదితరులు పాల్గొన్నారు.





