శేరిలింగంపల్లి, జూలై 4 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) సంజయ్ జాజును జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి, రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల (బీసీలు) సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలతో కూడిన సమగ్ర వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీసీల సంక్షేమం, సామాజిక న్యాయం, విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి, రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగినట్లు దుండ్ర కుమారస్వామి తెలిపారు. వినతిపత్రంలో పొందుపరిచిన అంశాలను సానుకూలంగా పరిశీలించి, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చీఫ్ సెక్రటరీ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

వినతిపత్రంలో ప్రధానంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేయడం, బీసీ సబ్‌ప్లాన్‌ను చట్టబద్ధంగా అమలు చేయడం, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను బలోపేతం చేయడం, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయడం, బీసీ హాస్టళ్లు, గురుకులాలను ఆధునీకరించడం, బీసీ యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు విస్తృతంగా కల్పించడం, సాంప్రదాయ బీసీ వృత్తులకు ప్రత్యేక రక్షణ, ప్రోత్సాహం అందించడం, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో జనాభా నిష్పత్తికి అనుగుణంగా బీసీలకు ప్రాతినిధ్యం కల్పించడం, అలాగే చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో త్రైమాసిక సమీక్షా కమిటీ ఏర్పాటు చేయడం వంటి డిమాండ్లను ప్రతిపాదించారు. తెలంగాణ రాష్ట్ర సామాజిక, ఆర్థికాభివృద్ధిలో బీసీలు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్న దుండ్ర కుమారస్వామి, వారి రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణతోపాటు సంక్షేమ పథకాల సమర్థ అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం కార్యదర్శి మణికంఠేశ్వర యాదవ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.





