దోమల నివారణకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక డ్రై డే ప్రచారం

శేరిలింగంప‌ల్లి, జూలై 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణతోపాటు ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మూడు జోన్ల పరిధిలో ప్రతి శుక్రవారం డ్రై డే దోమల నివారణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శుక్రవారం కేవలం 10 నిమిషాలు కేటాయించి ఇళ్లు, పరిసరాల్లో నిల్వ నీరు లేకుండా చూసుకోవడం ద్వారా దోమల ఉత్పత్తిని సమర్థవంతంగా అరికట్టవచ్చని అధికారులు ప్రజలకు వివరించారు. శానిటేషన్, ఫీల్డ్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. కుండీలు, కూలర్లు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ఇతర పాత్రల్లో నిల్వ నీరు ఉండకుండా చూసుకోవాలని, ఇల్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అలాగే ఓవర్ హెడ్ ట్యాంకులు, సంపులు, డ్రైనేజీలను క్రమం తప్పకుండా శుభ్రం చేయడంతోపాటు దోమల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ సృజ‌న‌ మాట్లాడుతూ ప్రతి కుటుంబం ప్రతి శుక్రవారం డ్రై డేని తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. వారానికి కేవలం 10 నిమిషాలు కేటాయించి నిల్వ నీటిని తొలగించడం ద్వారా దోమల వ్యాప్తిని నియంత్రించవచ్చని, ప్రజల భాగస్వామ్యంతోనే దోమల రహిత, ఆరోగ్యవంతమైన సైబరాబాద్‌ను నిర్మించగలమని పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here