శేరిలింగంపల్లి, జూన్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేపడుతున్న వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమంలో భాగంగా కమిషనర్ సృజన, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, సర్కిల్ సిబ్బంది, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ (ఆర్‌డబ్ల్యూఏ) ప్రతినిధులతో కలిసి కుత్బుల్లాపూర్ జోన్‌లోని కొంపల్లి సర్కిల్ పరిధి సాయి బాబా నగర్ వార్డులో క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నివాసితులు, ఆర్‌డబ్ల్యూఏ ప్రతినిధులు ప్రజా వసతులు, పార్కుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదలకు సంబంధించిన పలు సమస్యలు, సూచనలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని ప్రత్యక్షంగా పరిశీలించిన కమిషనర్ సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమీక్షలో భాగంగా పార్కు సమీపంలో అనధికార పార్కింగ్‌ను అరికట్టేందుకు బొల్లార్డులు ఏర్పాటు చేయాలని, దెబ్బతిన్న ఫుట్‌పాత్‌లను పునరుద్ధరించాలని, వాచ్‌మన్ గదికి మరమ్మత్తులు చేసి ఆధునీకరించాలని సూచించారు.

పార్కును సందర్శించే ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పించడంతోపాటు ఓపెన్ స్పేస్‌లలో జరుగుతున్న అనధికార నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓపెన్ స్పేస్‌ల పరిరక్షణ, అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, నాలా సంబంధిత సమస్యల పరిష్కారానికి అటవీ శాఖతో సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలతో నేరుగా మమేకమై స్థానిక అవసరాలను గుర్తించడం, సమస్యలను వేగంగా పరిష్కరించడం, మెరుగైన ప్రజా వసతులను అందించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కమిషనర్ తెలిపారు.





