కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జూన్ 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ అన్నారు. మహిళల అభ్యున్నతి, ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిర మహిళా శక్తి కార్యక్రమం మహిళల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకువస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిర మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా చందానగర్‌లోని అంబేద్కర్ కల్యాణ మండపంలో మియాపూర్ సర్కిల్ పరిధిలోని వివిధ డివిజన్ల మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీ శ్రీనివాస్, ప్రాజెక్టు ఆఫీసర్ స్వాతి రెడ్డి, మాజీ కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావుతో కలిసి పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ మహిళలకు చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ మియాపూర్ సర్కిల్ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం, సాధికారత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు స్వయం ఉపాధి రంగంలో ముందుకు తీసుకెళ్లేందుకు అనేక సంక్షేమ, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు తక్కువ వడ్డీ రుణాలు, ఆర్థిక సహాయం, శిక్షణ కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ స్వయం సమృద్ధి దిశగా నడిపిస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలను విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

చిన్నతరహా కార్మికులు, గృహ కార్మికులు, నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో స్వయం సహాయక సంఘాల్లో చేరి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళల ఆదాయ వృద్ధికి తోడ్పడేలా వివిధ వ్యాపార, సేవా రంగాల్లో స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్రను మరింత బలోపేతం చేసేందుకు ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, పెట్రోల్ బంకుల నిర్వహణ, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు సహా వివిధ ఆదాయ వనరులను కల్పించే వ్యాపార కార్యకలాపాల బాధ్యతలను స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే రాష్ట్ర అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని ఆరెకపూడి గాంధీ అన్నారు. మహిళల అభివృద్ధే కుటుంబం, సమాజం, రాష్ట్ర ప్రగతికి బలమైన ఆధారమని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.

మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఎల్లమ్మబండలో త్వరలోనే పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. మహిళల అభ్యున్నతికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని స్వశక్తితో ఎదిగి ఆర్థిక పరిపుష్టి సాధించాలని సూచించారు. మెప్మా అధికారులు, సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు మహిళా సాధికారత కోసం చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఆర్‌పీలు, ఆశా కార్యకర్తలు, ఇతర మహిళా స్థాయి అధికారుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లడంతోపాటు ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెప్మా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, మహిళలు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here