శేరిలింగంపల్లి, జూన్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ పరిధిలోని దీప్తిశ్రీనగర్ పార్కు కబ్జా అంశంపై జనం కోసం సంస్థ ప్రతినిధులు నూతనంగా బాధ్యతలు చేపట్టిన మియాపూర్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రావును కలిసి ఫిర్యాదు చేశారు. వారం క్రితం అప్పటి డిప్యూటీ కమిషనర్‌కు కూడా ఈ విషయమై ఫిర్యాదు చేసినప్పటికీ, ఇటీవల మళ్లీ ఆక్రమణలకు సంబంధించిన పనులు ప్రారంభమైనట్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగం రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజల వినియోగానికి ఉద్దేశించిన పార్కును కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆక్రమణలను అడ్డుకుని పార్కు స్థలాన్ని సంరక్షించాలని డిప్యూటీ కమిషనర్‌ను కోరారు. ఫిర్యాదుపై స్పందించిన డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రావు అంశాన్ని వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు జనం కోసం ప్రతినిధులు తెలిపారు. పార్కు రక్షణ కోసం అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని స్థానికులు కూడా కోరుతున్నారు.






