శేరిలింగంపల్లి, జూన్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి విలేజ్‌లో రూ.35 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యాదవ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, నార్నె శ్రీనివాసరావు, మంజుల రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరెకపూడి గాంధీ మాట్లాడుతూ లింగంపల్లి విలేజ్ ప్రజలు సమిష్టి కృషితో అన్ని హంగులు, సకల సౌకర్యాలతో కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇతర కాలనీలకు ఆదర్శంగా నిలిచిన లింగంపల్లి ప్రజలు అభివృద్ధి విషయంలో ముందుంటున్నారని అన్నారు. కమ్యూనిటీ హాల్‌ను సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు, చిన్నపాటి వేడుకలు, జన్మదినోత్సవాలు నిర్వహించుకునేందుకు అనువుగా నిర్మించారని తెలిపారు. కాలనీ సంక్షేమం, అభివృద్ధి కోసం ఈ భవనాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

శేరిలింగంపల్లి డివిజన్‌తోపాటు మొత్తం నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని గాంధీ వెల్లడించారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి కొనసాగుతుందని చెప్పారు. లింగంపల్లి విలేజ్‌లో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేపట్టామని, ఒకప్పటి అండర్‌పాస్ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి ట్రాఫిక్ సమస్యను పూర్తిగా తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం లింగంపల్లి విలేజ్‌తోపాటు వెంకట్‌రెడ్డి కాలనీలో పాదయాత్ర నిర్వహించి స్థానిక సమస్యలను పరిశీలించారు. ప్రజలు తెలిపిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, అభివృద్ధి కమిటీ సభ్యులు, వార్డు ప్రతినిధులు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.





