భాగ్యనగర్ వార్డులో కమిషనర్ సృజ‌న‌ పర్యటన

శేరిలింగంప‌ల్లి, జూన్ 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కూకట్‌పల్లి జోన్ పరిధిలోని భాగ్యనగర్ వార్డులో వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ కమిషనర్ సృజ‌న‌ విస్తృత పర్యటన నిర్వహించారు. జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌తోపాటు ఇతర అధికారులతో కలిసి ఆల్విన్ కాలనీ సర్కిల్‌లోని హెచ్‌ఎంటీ హిల్స్, జలవాయు విహార్ ప్రాంతాలను సందర్శించి స్థానిక సమస్యలు, మౌలిక వసతుల అవసరాలపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ (ఆర్‌డబ్ల్యూఏలు) ప్రతినిధులతో సమావేశమైన కమిషనర్, భీమునికుంట చెరువు వద్ద యూజీడీ రీమోడలింగ్, అవుట్‌లెట్ విస్తరణ పనులు, జలవాయు విహార్‌లో సీసీ రోడ్ల నిర్మాణం, రెండు కాలనీల్లో ఓపెన్ జిమ్‌ల ఏర్పాటు, సీవర్ క్లీనింగ్ యంత్రాల వినియోగం, ట్రాఫిక్ నిర్వహణ, అనధికార నిర్మాణాల నియంత్రణ, పార్కుల్లో ఎండిన ఆకుల కంపోస్టింగ్, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై అధికారులతో చర్చించారు.

స్థానిక నివాసితులు తమ సమస్యలు, సూచనలను కమిషనర్ దృష్టికి తీసుకురాగా, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆమె సంబంధిత శాఖలు, ఏజెన్సీలు సమన్వయంతో పనిచేసి పెండింగ్ అంశాల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పౌరులతో ప్రత్యక్షంగా మమేకమై స్థానిక అవసరాలను గుర్తించడం, సమస్యలకు వేగంగా పరిష్కారం చూపడం, పౌర సేవలను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమాన్ని కార్పొరేషన్ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here