మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఎంసీపీఐ(యు) భారీ ప్రదర్శన

శేరిలింగంపల్లి, జూన్ 5 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, కార్పొరేట్ అనుకూల ఆర్థిక నిర్ణయాలకు నిరసనగా మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ప్రదర్శన నిర్వహించింది. బాగ్ లింగంపల్లిలోని ఓంకార్ భవన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ వీఎస్టీ, అంబేద్కర్ కళాశాల మీదుగా సుందరయ్య పార్క్ వరకు సాగింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం స్వదేశీ ఆర్థిక విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సామ్రాజ్యవాద, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తోందని ఆరోపించారు. దేశ స్వాతంత్ర్యం అనంతరం రైతులు, కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.

కేంద్ర కమిటీ పిలుపు మేరకు జూన్ 2 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచార, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోదీ పాలనలో గత 12 ఏళ్లుగా నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు పెరిగాయని, ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా పోరాటాలే మార్గమని పేర్కొంటూ, జూన్ 8న కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించి రాష్ట్రపతికి వినతిపత్రాలు సమర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ నాయకులు మోర్తాల చందర్ రావు, నర్ల చంద్రశేఖర్, కుంభం సుకన్య, రాష్ట్ర నాయకులు ఎం. అరుణ్ కుమార్, మాదం తిరుపతి, మైదంశెట్టి రమేష్, తాండ్ర కళావతి, పల్లె మురళి, ప్రజా సంఘాల నాయకులు తాటికొండ రవి, మాలోతు రాజేష్ నాయక్, శివాని తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here