శేరిలింగంపల్లి, మే 25 (నమస్తే శేరిలింగంపల్లి): ఒకప్పుడు 118 ఎకరాల్లో విస్తరించి ఉన్న గంగారం పెద్ద చెరువు ప్రస్తుతం సగానికి పైగా కుచించుకుపోయిందని బీజేపీ యువనేత రగిరి సాయిరాం గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులో నీటి నిల్వలు తగ్గిపోవడంతో పరిసర కాలనీల్లో బోర్లు ఎండిపోతున్నాయని, ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చెరువు సుందరీకరణ పేరుతో జరుగుతున్న పనులపై ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయని విమర్శించారు. చెరువు పరిరక్షణ విషయంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. గంగారం పెద్ద చెరువు పరిధిలోని భూములు కబ్జాలకు గురవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. చెరువు సుందరీకరణ పనులను పారదర్శకంగా చేపట్టడంతోపాటు ఆక్రమణలను తొలగించి చెరువు భూములను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెరువు భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం, అధికారులను కోరిన ఆయన.. ప్రజల నీటి సమస్యను దృష్టిలో పెట్టుకుని వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.






