శేరిలింగంపల్లి, మే 21 (నమస్తే శేరిలింగంపల్లి): వెంకటేశ్వర నగర్ డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీకి చెందిన ప్రసాద్ రావు తనయుడు ఎం. జశ్వంత్ కుమార్ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి బంగారు పతకం సాధించాడు. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో 11వ ఇంటర్నేషనల్ మెగా ఫెడరేషన్, మలేషియా యోగా కల్చరల్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 16 నుండి 19 వరకు నిర్వహించిన అంతర్జాతీయ యోగాసన ఛాంపియన్షిప్–2026లో జశ్వంత్ కుమార్ గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ జశ్వంత్ కుమార్‌ను సత్కరించి అభినందించారు. గాంధీ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగాసన ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించడం గర్వకారణమని అన్నారు. మన ప్రాంతానికి చెందిన యువకుడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. జశ్వంత్ ఇతర యువతకు ఆదర్శంగా నిలిచాడని కొనియాడారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించి, వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహిస్తే వారు అద్భుత విజయాలు సాధిస్తారని తెలిపారు. యోగ శారీరక దారుఢ్యంతోపాటు మానసిక ప్రశాంతత, ఉల్లాసాన్ని కూడా అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జశ్వంత్ కుమార్ తండ్రి ప్రసాద్ రావుతోపాటు స్థానికులు పాల్గొన్నారు.






