శేరిలింగంపల్లి, మే 18 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ రామసంద్రం కుంట చెరువు, FCI కాలనీలోని పటేల్ చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులలో భాగంగా చెరువులో మురుగు నీరు కలవకుండా చేపట్టబోయే మురుగు నీటి మళ్లింపు, వరద నీటి కాలువ నిర్మాణం పనులను, ఇరిగేషన్ అధికారులు, CMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్బంగా శ్రీకాంత్ మాట్లాడుతూ చెరువులో కలుషిత నీరు కలవకుండా డ్రైనేజి వ్యవస్థ మళ్లింపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. డ్రైనేజీ వ్యవస్థ మళ్లింపు, వరదనీటి కాలువ నిర్మాణం పనులలో వేగం పెంచాలని, పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు DE రాజశేఖర్, AE గులాం, CMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు DE శ్రీదేవి, AE ప్రశాంత్, CSR ప్రతినిధి చైతన్య తదితరులు పాల్గొన్నారు.






