శేరిలింగంపల్లి, మే 11 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రతిరోజు ఒక వార్డు (One Ward Every Day) కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్ సృజన శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని నార్సింగి సర్కిల్ మణికొండ వార్డులో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. ఈ పర్యటనలో కమిషనర్ తోపాటు జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ పలు కాలనీల్లో పౌర సదుపాయాలను సమీక్షించి, స్థానిక నివాసితులు, కాలనీ సంక్షేమ సంఘాల (RWAs) ప్రతినిధులతో మాట్లాడి పారిశుధ్యం, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలు, పార్కుల నిర్వహణపై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

స్థానిక నివాసితులు పలు పౌర సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో, ముఖ్యంగా పాఠశాల జోన్లు, కాలనీల వద్ద వర్షపు నీరు నిలుస్తోందని ఫిర్యాదు చేశారు. SNDP నాలా పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయని, పాండం వాగు పనుల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. పనిచేయని వీధి దీపాలను బాగు చేయాలని, కొత్త వాటిని ఏర్పాటు చేయాలని కోరారు. హుడా కాలనీ, పరిసర ప్రాంతాలలో డ్రైనేజీ, యుజిడి (UGD) నిర్వహణ లోపాలను ప్రస్తావించారు. ఆస్తి పన్ను అంచనాల్లో ఉన్న పొరపాట్లు, సంబంధిత ఫిర్యాదులను పరిష్కరించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న బీటీ రోడ్ల పనులు పూర్తి చేయాలని, ఫుట్‌పాత్‌లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి రోడ్డు భద్రతను మెరుగుపరచాలని విన్నవించారు. పార్కుల అభివృద్ధి, నిర్వహణపై చర్చించారు. వాకింగ్ ట్రాక్ మరమ్మత్తులు, నీడతో కూడిన స్టేజ్, వాచ్‌మెన్ రూమ్, వాష్‌రూమ్ వసతులు కల్పించాలని కోరారు. చెత్తాచెదారాన్ని తొలగించి నిర్వహణను మెరుగుపరచాలని సూచించారు. పారిశుధ్యం, చెత్త సేకరణను బలోపేతం చేయాలని కోరారు. పార్కుల పరిసరాల్లో వీధి వ్యాపారులను క్రమబద్ధీకరించాలని నివాసితులు కోరారు.
ప్రభుత్వ కళాశాల వద్ద పెండింగ్‌లో ఉన్న పనులు, వెంకటేశ్వర కాలనీలో డ్రైనేజీ కనెక్టివిటీ సమస్యలను చర్చించారు. నాలాల ఆక్రమణల వల్ల వర్షపు నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయని ఫిర్యాదు చేశారు. జంక్షన్ల అభివృద్ధి, ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేపట్టాలని కోరారు. ఇళ్ల వద్ద, కాలనీల స్థాయిలో వర్షపు నీటి నిల్వ గుంతలను (Rainwater Harvesting Pits) ఏర్పాటు చేయాలని నివాసితులు చెప్పారు. సీనియర్ సిటిజన్ల కోసం లైబ్రరీ ఏర్పాటు చేయాలని, మణికొండలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అభివృద్ధి చేయాలని విన్నవించారు.
కమిషనర్ ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్, సంబంధిత విభాగాల అధికారులను ఆదేశిస్తూ.. పౌరులు లేవనెత్తిన సమస్యలన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో స్వీకరించి, వివిధ విభాగాల మధ్య సమన్వయంతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. పారిశుధ్య పనులను పటిష్టం చేయాలని, ఇంజనీరింగ్ పనులను వేగవంతం చేయాలని, రెగ్యులర్ ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్స్ నిర్వహించి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.





