పటాన్‌చెరు సర్కిల్ లో జోనల్ కమిషనర్ నారాయణ్‌ అమిత్ పర్యటన

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి జోనల్ కమిషనర్ నారాయణ్‌ అమిత్ బుధ‌వారం పటాన్‌చెరు సర్కిల్-46 పరిధిలో విస్తృత క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా పారిశుధ్య కార్మికులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు, పనితీరును అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జీవీపీ పాయింట్లను సందర్శించి చెత్త నిర్వహణ తీరును పరిశీలించారు. విలీన మున్సిపాలిటీలలో డ్రైనేజీ వ్యవస్థల పనితీరును సమీక్షించి, వర్షాకాలం దృష్ట్యా పూడికతీత పనులు వేగవంతం చేయాలని సూచించారు. కొల్లూరు 2BHK హౌసింగ్ కాలనీలో నివాసితులతో సమావేశమై మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, నీటి సరఫరా వంటి ప్రజా సమస్యలపై అభిప్రాయాల‌ను సేకరించారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చివరగా కొల్లూరు డంపింగ్ యార్డును సందర్శించి అక్కడి చెత్త నిర్వహణ, ప్రాసెసింగ్ పనులను పరిశీలించారు. డంపింగ్ యార్డులో ఏర్ప‌డే సమస్యలను శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ప్రజారోగ్యం, పరిశుభ్రతే ప్రధాన లక్ష్యంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని జోనల్ కమిషనర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ జ్యోతి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here