శేరిలింగంపల్లి, ఏప్రిల్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): దోమల వృద్ధిని సమర్థవంతంగా అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) అర్బన్ మలేరియా స్కీమ్ (UMS) కింద అన్ని జోన్లలో ముమ్మరంగా యాంటీ-లార్వా కార్యకలాపాలను (ALO) నిర్వహించింది. శనివారం కార్పొరేషన్ పరిధిలో 104 కాలనీల్లో తనిఖీలు చేయగా 269 దోమల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో 95 చోట్ల నివారణ చర్యలు చేపట్టారు. 15 చోట్ల ఆయిల్ బాల్స్ వదిలారు. డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా ఉండటానికి కార్పొరేషన్ ఈ కార్యక్రమాలను చేపట్టింది. దీనికి అదనంగా దోమల ఆవాసాలను నిర్మూలించడానికి 12 చెరువుల్లో గుర్రపుడెక్క (Water Hyacinth) తొలగింపు పనులను వేగంగా నిర్వహిస్తున్నారు.

శేరిలింగంపల్లి జోన్లో మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్ల పరిధిలో దోమల ఉత్పత్తి కేంద్రాలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో నిరంతర నివారణ చర్యలు చేపట్టారు. అలాగే కూకట్పల్లి జోన్ పరిధిలోని మూసాపేట, కూకట్పల్లి సర్కిళ్లు, కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని గాజుల రామారం, జీడిమెట్ల సర్కిళ్లలోనూ ఎక్కువగా దోమల ఉత్పత్తి కేంద్రాలు ఉండడంతో ఆయా ప్రాంతాల్లోనూ వేగంగా చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ప్రజలకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. నిల్వ ఉన్న నీటిని తొలగించడం ద్వారా దోమల ఉత్పత్తి కేంద్రాలను నిర్మూలించడం, అనుమతించబడిన లార్విసైడ్లను ఉపయోగించి నీటి వనరులకు యాంటీ-లార్వా చికిత్స చేయడం, నీటి కుంటలలో లార్వా పెరగకుండా ఆయిల్ బాల్స్ వేయడం, రెండు వారాల వరకు ప్రభావవంతంగా ఉండే ఆల్ఫా సైపర్మెత్రిన్ పౌడర్‌తో దోమల నివారణ స్ప్రేయింగ్, ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేయడం, నివాసితులకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను నిర్వహించారు.
ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలని, నీటి ట్యాంకులు, కూలర్లు, పాత్రలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని, వాడని టైర్లు, బాటిళ్లు, ఇతర సామాగ్రిని పారవేయాలని, తనిఖీలకు వచ్చే క్షేత్రస్థాయి సిబ్బందికి సహకరించాలని ఈ సందర్భంగా అధికారులు కోరారు. సైబరాబాద్‌ను సురక్షితమైన, దోమల రహిత నగరంగా మార్చడానికి కార్పొరేషన్ నిరంతరం ఎంటమాలజీ కార్యకలాపాలను నిర్వహిస్తోందని, ప్రజారోగ్య రక్షణే లక్ష్యంగా అన్ని జోన్లలో సమన్వయంతో కూడిన పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు.





