శేరిలింగంపల్లి, ఏప్రిల్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం (స్థాపన దివస్) సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి మెయిన్ రోడ్డులో సీనియర్ నాయకుడు కిషన్ గౌలి ఆధ్వర్యంలో, నానక్‌రామ్‌గూడలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు శివ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న స్థాపించబడినప్పటి నుండి సాధారణ కార్యకర్తల శక్తితో ఎదుగుతూ దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించిందన్నారు. ప్రారంభ దశలో కేవలం 2 ఎంపీ స్థానాలతో ప్రారంభమైన ఈ పార్టీ, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ క్రమంగా తన బలాన్ని పెంచుకుందని తెలిపారు. అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన సత్తాను చాటుకున్న బీజేపీ, అనంతరం నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అఖండ విజయాలను సాధిస్తూ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశ అభివృద్ధికి కొత్త దిశను చూపుతోందన్నారు. ప్రతి కార్యకర్త నిబద్ధత, త్యాగం, సేవాభావంతో పార్టీ మరింత శక్తివంతంగా ఎదగాలని కోరుకుంటూ, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ లోని రాష్ట్ర, జిల్లా, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, యువ నాయకులు, మహిళలు, కాలనీ వాసులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






