శేరిలింగంపల్లి, ఏప్రిల్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర హైకోర్టు విద్యార్థుల ఫీజు బకాయిల నేపథ్యంలో ఇచ్చిన తీర్పు సరైంది కాదని, విద్యార్థుల నుండి వసూలు చేసి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత తిరిగి విద్యార్థులకు చెల్లించాలని తీర్పు ఇవ్వడం సరైంది కాదని, ఇది విద్యార్థుల చదువులకు, అభివృద్ధికి గొడ్డలి పెట్టని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య(ఏఐఎఫ్‌డీఎస్) రాష్ట్ర ప్రధాన అధ్యక్షుడు పల్లె మురళి అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా పల్లె మురళి మాట్లాడుతూ హైకోర్టు తన తీర్పును పునః సమీక్ష చేయాలని కోరారు. ప్రైవేటు కళాశాలలు ప్రభుత్వం ప్రకటించిన ఫీజు పథకం అమలు చేస్తామని అంగీకారాన్ని తెలిపి విద్యార్థులను చేర్చుకున్నారని, అలాంటిది ప్రైవేటు యజమాన్యాల బకాయిలను చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వకుండా విద్యార్థుల నుండి వసూలు చేసుకోండి అనే తీర్పు ఇవ్వడం సరికాదని అన్నారు. అణగారిన వర్గాల నుండి ఇప్పుడే ఉన్నత విద్యలోకి వస్తున్న ఈ ఫీజులు పొందే వారు పేద విద్యార్థులు రాష్ట్రంలో 14 లక్షల మంది ఉన్నారని, వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులే అధికంగా ఉన్నారని, వారు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఈ తీర్పు వలన మరింత ఇబ్బందులకు గురవుతారని, ఇప్పటికే రాష్ట్రంలో ప్రైవేటు యజమాన్యాలు ఫీజు బకాయిలు రావడంలేదని పేద విద్యార్థుల సర్టిఫికెట్స్ ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నాయని, దీనివల్ల గతంలో విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియెంబర్స్‌మెంట్ స్కాలర్ షిప్‌లను విడుదల చేసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. హైకోర్టు తన తీర్పును పునఃసమీక్షించి ప్రభుత్వానికి తక్షణమే ఫీజు విడుదల కోసం ఆదేశాలు ఇవ్వాలని కోరారు.






