శేరిలింగంపల్లి, మార్చి 19 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమాచార్య భావనావాహిని వ్యవస్థాపక అధ్యక్షురాలు డా. శోభా రాజు ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా శిష్యుడు శ్రీరామ్ కొండలలో నెలకొన్న అన్నమయ్య కీర్తనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పెద్దింటి వెంకట భాస్కర సత్యనారాయణాచార్యులుచే పంచాంగ శ్రవణం చేశారు. అన్ని రాశుల వారి రాశి ఫలాలను, విచ్చేసిన వారందరికీ అర్థమయ్యే రీతిలో తెలిపారు. శోభా రాజు మాట్లాడుతూ అన్ని రాశుల వారు ఒక్క దైవచింతన కలిగి ఉంటే అంతా మంచే జరుగుతుందని తెలిపారు. తొలిసారిగా దశావధాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో సురభి శంకర శర్మచే రెండు గంటల పాటు రసవత్తరంగా దశావధానం సాగింది. వివిధ అంశాలపై ప్రుచ్ఛకులు వేసిన చిక్కటి సమస్యలను ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా వివరించారు.

చివరిగా పంచాంగ శ్రవణం చేసిన పండితులకు సంస్థ అధ్యక్షురాలు డా. శోభా రాజు, మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ సంస్థ జ్ఞాపికను ఇచ్చి గౌరవించారు. శ్రీ అన్నమాచార్య సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మంగళహారతి, విచ్చేసిన వారందరికీ చక్కటి సాంప్రదాయ పద్ధతిలో భోజన ప్రసాదాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని ముగించారు.






