శేరిలింగంపల్లి, మార్చి 13 (నమస్తే శేరిలింగంపల్లి): అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని శేరిలింగంపల్లి బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిర్వహించిన బీజేపీ మహా ధర్నా కార్యక్రమంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజి రెడ్డి, బీజేపీ శ్రేణులు, దరఖాస్తుదారులతో కలిసి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ పాల్గొని ప్రభుత్వానికి చురకలు అంటించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 50వేల మందికి పైగా ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేశారని, కానీ 350 లోపు ఇళ్లను నిర్మించారని, గుల్‌మోహర్ పార్క్ వద్ద 244, హఫీజ్‌పేటలో 100 నిర్మించారని అన్నారు. వాటిల్లో కూడా చాలా మందికి ఇవ్వలేదని అన్నారు. 7.50 లక్షల ఓటర్లు, 10 లక్షల జనాభా ఉన్న నియోజకవర్గంలో కేవలం 500 మందికి మాత్రమే ఇళ్లను ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలలో ఏ ఒక్కటి సరిగ్గా అమలు చేయలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హామీలను నిలబెట్టుకోవాలని, లేకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నియోజకవర్గ, డివిజన్, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులు తదితరులు పాల్గొన్నారు.






