శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

  • కార్యాలయ రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, దరఖాస్తుల పరిశీలన
  • పలు అక్రమాలు జరిగినట్లు గుర్తింపు
  • చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ సిఫార్సు

శేరిలింగంప‌ల్లి, మార్చి 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రంగారెడ్డి రేంజ్ యూనిట్ ఏసీబీ అధికారులు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శేరిలింగంపల్లి జోన్ శేరిలింగంపల్లి సర్కిల్ 49 డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయ రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, మొత్తం పనితీరును వారు పరిశీలించారు. గతేడాది డిసెంబర్ 2న శేరిలింగంపల్లి సర్కిల్ 20ని జీహెచ్‌ఎంసీ నుంచి విడదీసి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకువస్తూ సర్కిల్ 49గా మార్చిన విషయం తెలిసిందే. పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండడంతో డిసెంబర్ 2 కంటే ముందు ఉన్న రికార్డులు సర్కిల్ 49 కార్యాలయంలో అందుబాటులో లేవని, ఆ తరువాత నుంచి ఉన్న రికార్డుల ఆధారంగా తనిఖీలు చేపట్టామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సోదాల్లో పలు అక్రమాలు వెలుగు చూసినట్లు వివరించారు.

డిసెంబర్ 2025 నుంచి ఇప్పటి వరకు మొత్తం 285 భవన నిర్మాణ అనుమతి దరఖాస్తులు వచ్చాయని, వాటిల్లో 134 ఆమోదం పొందగా, 21 తిరస్కరించబడ్డాయని, 63 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మిగిలినవి షార్ట్ ఫాల్ నోటీసులు, ఫీజు చెల్లింపు తదితర దశల్లో ఉన్నట్లు తెలిపారు. ప్రక్రియలో ఉన్న దరఖాస్తుల్లో 16 సెక్షన్ ఆఫీసర్ వద్ద ఉండగా, 25 అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) వద్ద, 22 డిప్యూటీ కమిషనర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, నిబంధనల ప్రకారం నిర్ణీత 21 రోజుల గడువు దాటి 21 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తించినట్లు తెలిపారు. ఇందులో 5 ఏసీపీ వద్ద ఉండగా, 16 డిప్యూటీ కమిషనర్ వద్ద ఉన్నాయని అన్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో జరుగుతున్న జాప్యాన్ని ఈ దరఖాస్తులు సూచిస్తున్నాయని అన్నారు. ఇదే కాలవ్యవధిలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి 63 ఫిర్యాదులు వచ్చాయని, చాలా కేసుల్లో రెండో నోటీసు ఇచ్చినప్పటికీ 14 కేసుల్లో గడువు ముగిసినా ఎటువంటి తదుపరి చర్యలు తీసుకోకుండా ఫైళ్లను పెండింగ్‌లో ఉంచినట్లు గుర్తించామని తెలిపారు.

కొన్ని అక్రమ నిర్మాణాల కేసులు ఎటువంటి తుది ఉత్తర్వులు ఇవ్వకుండా లేదా ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు తీసుకోకుండా నెలల తరబడి, కొన్ని ఏడాదికి పైగా పెండింగ్‌లో ఉన్నాయని గమనించామని తెలిపారు. మొదటి నోటీసు తరువాత నిర్ణీత సమయం లోగా 10 కేసుల్లో రెండో నోటీసులు జారీ చేయలేదని గుర్తించామని, వాటిలో 4 కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉండగా, 1 కేసులో నోటీసు సిద్ధం చేసినా దాన్ని ప్రతివాదికి అందజేయకుండా ఫైల్‌ను అలాగే ఉంచినట్లు గుర్తించామని అన్నారు. తనిఖీల్లో భాగంగా అధికారులు, ప్రైవేటు వ్యక్తుల మధ్య కొన్ని అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గమనించామని, వీటిపై సంబంధిత అధికారులు మరింత లోతుగా విచారణ జరపాల్సి ఉందని పేర్కొన్నారు. ఆకస్మిక తనిఖీల ద్వారా పనుల్లో జాప్యం, సకాలంలో ఫాలో అప్ లేకపోవడం, ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలపై పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుందని గుర్తించామని, దీనిపై సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించనున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here