అన్నమయ్యపురంలో అలరించిన కూచిపూడి నృత్యార్చనలు

శేరిలింగంప‌ల్లి, మార్చి 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానం – అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం మధ్యాహ్నం భక్తులకు అన్నదాన ప్రసాదం వితరణ జరిగింది. అనంతరం సాయంత్రం యథావిధిగా పారాయణ కార్యక్రమం నిర్వహించగా, తదుపరి భక్తిశ్రద్ధలతో కూచిపూడి నృత్యార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన నృత్యాంజలి కూచిపూడి కళానిలయం ఆధ్వర్యంలో జ్ఞానేశ్వరి హట్టి మార్గదర్శకత్వంలో శిష్యులు స్వామి వారికి నృత్య కైంకర్యాన్ని అర్పించారు. ఈ బృందంలో సంహిత, ఓజస్విత, అన్విక, హర్షిత, సహనా, శరణ్య, హసిని, అక్షయ, కాత్యాయని, నిత్య మేఘన, వర్షిత తదితరులు పాల్గొన్నారు. వీరు మూషిక వాహన, బాల గోపాల తరంగం, శ్రీ విఘ్నరాజం భజే, బాల త్రిపుర సుందరి, లలిత హారతి వంటి నృత్యాంశాలను భావాభినయంతో ప్రదర్శించి భక్తులను ఆకట్టుకున్నారు.

అనంతరం సాయి అభినయ కూచిపూడి కళాక్షేత్రం, మేడిపల్లికు చెందిన నాట్య గురువు సంధ్యారాణి శివలంక శిష్యులు శ్రీశాన్వి, రేణుశ్రీ, ఝాన్విక, కీర్తన, హేమలత, శ్రీజ, దీక్షిత, రశ్మిత, సాయి జాహ్నవి తదితరులు పాల్గొని గణేశ పంచరత్నం, జయ జయ దుర్గే, ఒకపరి ఒకపరి, కృష్ణ శబ్దం, చక్కని తల్లికి, బ్రహ్మమొక్కటే, గరుడ గమన, వినాయక కౌత్వం వంటి నృత్య ప్రదర్శనలను సమర్పించారు. శిష్యుల నృత్యాలు లయ, భావ, అభినయ సమన్వయంతో సాగి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పద్మశ్రీ డా. శోభారాజు ఒక అన్నమయ్య సంకీర్తనకు భావార్థ వివరణ ఇచ్చి, నాట్య గురువులు తమ శిష్యులను సాహిత్య భావం, లయ, అభినయ సమన్వయంతో తీర్చిదిద్దుతున్న విధానం ప్రశంసనీయం అని అభినందించారు.

కళాకారులకు అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ డా. శోభారాజు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నంద కుమార్ సంయుక్తంగా శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారి జ్ఞాపికల‌ను అందించి ప్రశంసించారు. కార్యక్రమం ముగింపులో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళహారతి సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణతో ఈ శనివారం అన్నమయ్యపురంలో జరిగిన అన్నదానం – పారాయణం – నృత్యార్చన కార్యక్రమం భక్తి, నాట్య మాధుర్యంతో విజయవంతంగా ముగిసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here