శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 15 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ ఫేజ్ – 2లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక సేవాలాల్ ఆలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ గిరిజనుల ఆరాధ్య దైవం, అహింసావాది సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన బాట అందరికీ ఆదర్శనీయమని గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో ఆయన కృషి మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గిరిజన సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






