శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 13 (నమస్తే శేరిలింగంపల్లి): సంగారెడ్డిలో ఎన్నికల విధుల్లో ఉన్న సీఐ శివకుమార్‌పై దురుసుగా ప్రవర్తించిన ఘటన బీసీ సమాజ హృదయాలను కలిచివేసిందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి తెలిపారు. కాచిగూడలో జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీల గౌరవం మీద ఎవరైనా దాడి చేస్తే, అది ఒక్క వ్యక్తిపై దాడి కాదు, యావత్ బీసీ ఆత్మగౌరవం పై దాడి అని ఘాటుగా హెచ్చరించారు. సంగారెడ్డిలో యాదవ సామాజిక వర్గానికి చెందిన సీఐ శివకుమార్‌ను ప్రజల మధ్య అవమానించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పోలీస్ వ్యవస్థ ఒక రక్షకశక్తి. రాత్రింబవళ్లు ప్రజల భద్రత కోసం ప్రాణాలకు ప్రాణంగా కాపలా కాస్తున్న అధికారిని బజారులో అవమానించడం అంటే ప్రజాస్వామ్య విలువలకే చెరగని మచ్చ వేసినట్టేనని అన్నారు.

ఒక బీసీ వ్యక్తి కష్టపడి చదివి, పోటీ పరీక్షలు రాసి, సేవలోకి వచ్చి, ప్రజల కోసం విధులు నిర్వర్తిస్తుంటే అతన్ని అవమానించడం అంటే వేలాది బీసీ యువత కలలను అవమానించినట్టే అని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ హామీల నేపథ్యంలో బీసీ సమాజం కాంగ్రెస్‌కు అండగా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు. అలాంటి సందర్భంలో బీసీ అధికారిని లక్ష్యంగా చేసుకుని అనరాని మాటలు మాట్లాడటం యావత్ బీసీ జాతి గౌరవాన్ని దెబ్బతీసే చర్యగా పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు మాటలతో మార్గదర్శకులు కావాలి, అవమానాలతో కాదు. నాయకత్వం అంటే బాధ్యత, అహంకారం కాదు అని స్పష్టం చేశారు. రాజ్యాంగం అందరికీ సమానత్వం ఇచ్చిందని, ఆ సమానత్వాన్ని కాపాడటం ప్రతి ప్రజా ప్రతినిధి ధర్మమని అన్నారు. బీసీలు ఈ దేశానికి వెన్నెముకలని, శ్రమతో ఎదిగే సమాజమని పేర్కొన్నారు.
బీసీ అధికారులను చిన్నచూపు చూడడం అనేది సమాజ ఆత్మగౌరవాన్ని అవమానించినట్టేనని హెచ్చరించారు. గౌరవం అడిగేది కాదు, సాధించేది. కానీ అవమానాన్ని మాత్రం ఎప్పటికీ సహించం.. అని గర్జించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పోలీస్ వ్యవస్థ గౌరవాన్ని కాపాడాలని కోరారు. ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీకి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఇది వ్యక్తిగత ప్రతీకారం కాదు, ఇది ఆత్మగౌరవ పోరాటం. బీసీల గౌరవం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మనం ఐక్యంగా నిలబడాలి. మౌనం కాదు, సమాధానం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని దుండ్ర కుమారస్వామి పిలుపునిచ్చారు.





