మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైదరాబాద్‌లోని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో వైద్యులు అరుదైన, అత్యంత ప్రమాదకరమైన గర్భసంబంధ అత్యవసర పరిస్థితిని విజయవంతంగా ఎదుర్కొని తల్లి, పుట్టబోయే బిడ్డ ప్రాణాలను కాపాడారు. 27 వారాల గర్భంతో ఉన్న మహిళకు అపెండిక్స్ పగిలి తీవ్ర ఇన్ఫెక్షన్‌ ఏర్పడిన నేపథ్యంలో, సమయోచిత నిర్ణయాలు, బహుశాఖల వైద్యుల సమన్వయంతో కూడిన చికిత్స ద్వారా ఈ క్లిష్టమైన కేసును సురక్షితంగా నిర్వహించారు. ఆ గర్భిణీకి గతంలో రెండుసార్లు గర్భస్రావం జరగడం, APLA పాజిటివ్‌గా ఉండటం వంటి హైరిస్క్ వైద్య చరిత్ర ఉంది. తీవ్ర కడుపు నొప్పి, సెప్సిస్‌తో అత్యంత ప్రమాదకర స్థితిలో ఆమెను మరో ఆసుపత్రి నుంచి మెడికవర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. తల్లి, శిశువు ఇద్దరికీ సమానంగా ప్రాణాపాయం ఉన్న పరిస్థితిలో డాక్టర్ వరలక్ష్మి నేతృత్వంలోని హైరిస్క్ ప్రసూతి విభాగం వెంటనే కేసును స్వీకరించి చికిత్స ప్రారంభించింది.

పరీక్షల అనంతరం ఇది గర్భధారణ సమయంలో అరుదుగా కనిపించే, ప్రాణాంతకమైన అపెండిక్స్ రప్చర్ కేసు అని వైద్యులు నిర్ధారించారు. ఆలస్యం జరిగితే తల్లి సెప్సిస్‌కు లోనవడం, శిశువు మృతి లేదా ముందస్తు ప్రసవం జరగే ప్రమాదం ఉండటంతో, తక్షణమే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అన్ని విభాగాల వైద్యుల సమన్వయంతో డాక్టర్ వెంకట పవన్ అత్యంత జాగ్రత్తలతో లాపరోస్కోపిక్ అపెండికెక్టమీని విజయవంతంగా నిర్వహించారు. శస్త్రచికిత్స సమయంలో గర్భాశయంపై ఒత్తిడి తగ్గించడం, నియంత్రిత గాలి పీడనం, నిరంతర శిశువు హృదయ స్పందన పర్యవేక్షణ, అప్రమత్తమైన అనస్థీషియా నిర్వహణ వంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి సంక్లిష్టతలు లేకుండా ఆపరేషన్ పూర్తై గర్భధారణను సురక్షితంగా కొనసాగించారు.

ఆపరేషన్ అనంతరం గర్భిణీని హైరిస్క్ ప్రసూతి విభాగం పర్యవేక్షణలో ఉంచి, రక్తం గడ్డకట్టకుండా మందులు, థ్రాంబోప్రొఫైలాక్సిస్, తల్లి ఆరోగ్య పరీక్షలు, శిశువు ఎదుగుదల స్కాన్ ల‌ను క్రమం తప్పకుండా నిర్వహించారు. గర్భధారణ సజావుగా కొనసాగుతూ 37 వారాల నాలుగు రోజుల వద్ద శిశువుకు ఫీటల్ డిస్ట్రెస్ కనిపించడంతో అత్యవసర సిజేరియన్ చేశారు. శిశువు మెడకు, శరీరానికి బొడ్డుతాడు గట్టిగా చుట్టుకొని ఉండటం, అమ్నియోటిక్ ద్రవం తగ్గిపోవడం వంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, వైద్యుల వేగవంతమైన చర్యలతో పూర్తిగా ఆరోగ్యవంతమైన శిశువు జన్మించింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ వరలక్ష్మి మాట్లాడుతూ, ఇది అనేక ప్రమాదకారక అంశాలతో కూడిన అత్యంత క్లిష్టమైన గర్భధారణ. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరి ప్రాణాలను కాపాడగలిగాం. గర్భధారణలో ఉన్నా అవసరమైన శస్త్రచికిత్సను ఆలస్యం చేయడం ప్రమాదకరం అనే విషయాన్ని ఈ కేసు స్పష్టంగా చూపించింది.. అన్నారు. డాక్టర్ వెంకట పవన్ మాట్లాడుతూ, గర్భిణీలకు లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స చేయడం చాలా నైపుణ్యం, అప్రమత్తత అవసరమైన ప్రక్రియ. ఇన్ఫెక్షన్‌ను నియంత్రించడమే కాకుండా శిశువుకు ఎలాంటి హాని కలగకుండా చూడడం మా ప్రధాన లక్ష్యం అని తెలిపారు. డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగె మాట్లాడుతూ, ముందస్తు ప్రసవం జరగకుండా నిరోధించడమే మా ప్రధాన ఆలోచన. నిరంతర పర్యవేక్షణ వల్ల శిశువు పూర్తి గర్భకాలంతో ఆరోగ్యంగా జన్మించింది.. అన్నారు.

బహుశాఖ వైద్య బృందాల సమన్వయం, ఆధునిక సదుపాయాలు, రోగి కేంద్రిత వైద్య విధానం వల్లే ఇలాంటి అత్యంత క్లిష్టమైన హైరిస్క్ కేసులను విజయవంతంగా నిర్వహించడం సాధ్యమవుతోందని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ యాజమాన్యం తెలిపింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here