వైభవోపేతంగా వైజాగ్ సిస్టర్స్ శిష్యుల స్వరార్చన

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానం – అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం విశాఖపట్నానికి చెందిన ప్రఖ్యాత విజాగ్ సిస్టర్స్ ప్రశాంతి నల్లంచక్రవర్తుల, సంతోషి నల్లంచక్రవర్తుల శిష్య బృందం భక్తిశ్రద్ధలతో స్వరార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం సుమారు వంద మందికి పైగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, సాయంత్రం స్వరార్చన అత్యంత శ్రావ్యంగా వైభవంగా సాగింది. తొలుత శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, అన్నమయ్య అష్టోత్తరం, గురు స్తుతితో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం ప్రశాంతి నల్లంచక్రవర్తుల శిష్యులు కీర్తి, హేమిత, స్వేచ్ఛ, వాణి, శణ్ముఖి, అశ్విక్, ప్రమిల, స్వర్ణలత, థాస్విక, సాహస్, రేణుక, ఇషిత, ప్రణతి, సహస్ర, శ్రీరమ్య, ఆర్నిక, సుమేధ, డింపుల్ తదితరులు సమిష్టిగా అణురేణు పరిపూర్ణ, కొండలలో నెలకొన్న, గోవిందాశ్రిత, చక్కని తల్లికి, ఎంతని నుతియింతు అనే అన్నమయ్య సంకీర్తనలను మధుర స్వరాలతో ఆలపించగా, సంతోషి నల్లంచక్రవర్తుల శిష్యులు అఖిల్, శ్రీమాన్, శ్రీకీర్తి, ఉషిక, అర్పిత, విద్యాధరి, సుందరి, ఝాన్సీ, శ్రావణి, శ్రీజ, హృతిక, మంజు, పద్మలత, ప్రసూన, సహజ తదితరులు ఇట్టిముద్దులాడి, ఇందరికీ అభయమ్ము, వినరో భాగ్యము, చూడరమ్మా సతులాలా, తందనానా అహి అనే ప్రముఖ అన్నమయ్య సంకీర్తనలను భక్తితో ఆలపించి స్వరార్చనకు మరింత వైభవాన్ని చేకూర్చారు. వీరికి వయోలిన్‌ పి.ఎస్.ఆర్.కే. పవన్, మృదంగం వీరా స్వామి వాయిద్య సహకారం అందించి గానానికి మరింత మాధుర్యాన్ని సమకూర్చారు.

ఈ సందర్భంగా పద్మశ్రీ డా. శోభారాజు ఒక అన్నమయ్య సంకీర్తనకు అర్థ వివరణ ఇచ్చి, ప్రదర్శన గురించి మాట్లాడుతూ విజాగ్ సిస్టర్స్ గురువులు తమ శిష్యులను సాహిత్య భావం, భక్తి సమన్వయంతో తీర్చిదిద్దుతున్న విధానం ప్రశంసనీయం అని అభినందించారు. పాల్గొన్న ప్రతి శిష్యుల గానం భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని పంచిందని తెలిపారు. అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ వ్యవస్థాపకురాలు శోభారాజు, మేనేజింగ్ ట్రస్టీ నందకుమార్ కళాకారులందరికి జ్ఞాపికల‌ను అందించి తదుపరి గురువులను సగౌరవంగా సత్కరించారు. కార్యక్రమం చివరగా శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళహారతి సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణతో ఈ అన్నమ స్వరార్చన కార్యక్రమం భక్తి, సంగీత మాధుర్యంతో విజయవంతంగా ముగిసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here