శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సేవా పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా మహిళా మోర్చా ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గౌలిదొడ్డి అప్పర్ ప్రైమరీ స్కూల్‌లలో ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్, ఆపరేషన్ సింధూర్ తదితర జాతీయ అంశాలపై వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. అలాగే వారి శారీరక, మానసిక అభివృద్ధి కోసం క్రికెట్ బ్యాట్స్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, షటిల్, యోగా మ్యాట్స్, చెస్ బోర్డులు వంటి క్రీడా సామగ్రిని కూడా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తి, సృజనాత్మకత, సామాజిక అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని, క్రీడల ద్వారా క్రమశిక్షణ, జట్టు భావన, క్రీడాస్ఫూర్తి పెంపొందుతాయని పేర్కొన్నారు. భారత భవిష్యత్తు నిర్మాణంలో యువత పాత్ర కీలకమని, ప్రధాని నరేంద్ర మోదీ కలలు కంటున్న వికసిత్ భారత్ 2047 సాధనలో ప్రతి విద్యార్థి తన వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాష్ట్ర, జిల్లా, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, మహిళా మోర్చా, యువమోర్చా, ఎస్టీ మోర్చా నాయకులు, మహిళ నాయకులు, మహిళ కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.





