శేరిలింగంపల్లి, ఆగస్టు 26 (నమస్తే శేరిలింగంపల్లి): పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని, పర్యావరణ పరిరక్షణ ఒక దీక్షలా చేపట్టాలని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లోని కార్పొరేటర్ కార్యాలయం వద్ద వినాయక చవితి పండుగను పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2000 మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకోవడం మానవ ధర్మం, పర్యావరణ పరిరక్షణకు గాను ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారీస్తో తయారు చేసిన వినాయక ప్రతిమలను వాడవద్దని సూచించారు.రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.






