శేరిలింగంపల్లి, ఆగస్టు 23 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లికి చెందిన పోతుకూచి సోమసుందర సోషల్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్‌కు ప్రతిష్టాత్మకమైన సంత్ ఈశ్వర్ స్పెషల్ సర్వీసర్ హానర్ 2025 అవార్డు దక్కింది. ఈ మేరకు సంత్ ఈశ్వర్ సమ్మాన్ సమితి ఒక ప్రకటన విడుదల చేసింది. మహిళా, శిశు సంక్షేమం, అభివృద్ధి రంగంలో పోతుకూచి సోమసుందర సోషల్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించినట్లు సంత్ ఈశ్వర్ సమ్మాన్ సమితి తెలియజేసింది. తమ సమితి 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాదికి గాను ఈ అవార్డును పోతుకూచి ట్రస్ట్‌కు అందిస్తున్నట్లు సమితి ప్రతినిధులు తెలిపారు. అక్టోబర్ 5వ తేదీన దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో జరగనున్న ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ ఈ అవార్డును అందజేస్తారని తెలిపారు. ఇందులో భాగంగా విశేష్ సమ్మాన్ (స్పెషల్ హానర్) అవార్డును పోతుకూచి ట్రస్ట్ నిర్వాహకులు అందుకోనున్నారు.






