శేరిలింగంపల్లి, జూలై 23 (నమస్తే శేరిలింగంపల్లి): భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి స్థాపించి 45 సంవత్సరాలు పూర్తిచేసుకొని , 46వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా సిద్ధం బజార్ బహేతీ భవన్ లో రాష్ట్ర కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు జి.రాఘవ రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం చవితి ఆగస్ట్ 27 వ తేదీన వచ్చిందని అన్నారు. ఆ రోజున శ్రీ వినాయక స్థాపన చేసి సెప్టెంబర్ 6వ తేదీన అనంత చతుర్దశి నాడు శ్రీ వినాయక నిమజ్జనం చేయాలని తెలిపారు. భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడు, మొదటి మాజీ ఉప ప్రధాన మంత్రి , హోమ్ శాఖ మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలన్నారు. శ్రీ గణేష్ ఉత్సవాలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అసెంబ్లీల వారిగా పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి బి. రాజవర్ధన్ రెడ్డి , సైబరాబాద్ కమీషనరేట్ పరిధి కన్వీనర్ బద్దం మహిపాల్ రెడ్డి , శేరిలింగంపల్లి అసెంబ్లీ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పోరెడ్డి బుచ్చిరెడ్డి , మూల అనిల్ గౌడ్ , గొల్లపల్లి రాంరెడ్డి , పార్ నంది మాణిక్ రావు , కైతాపురం జితేందర్, వివిధ క్షేత్రాల నాయకులు పాల్గొన్నారు.






