శేరిలింగంపల్లి, నవంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): అనుమానాస్పద స్థితిలో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చందానగర్‌లోని శంకర్‌నగర్‌లో నివాసం ఉండే ఎస్.స్రవంతి (35) ఈ నెల 28వ తేదీన ఉదయం 9.44 గంటలకు తన సోదరుడు అయిన దూలబోయిన సుధీర్ కుమార్‌కు ఫోన్ కాల్ చేసింది. అయితే అతను డ్రైవింగ్‌లో ఉన్నందున ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదు. ఈ క్రమంలోనే అతను ఫోన్ చూసుకుని తిరిగి స్రవంతికి మూడు సార్లు ఫోన్ చేశాడు. కానీ ఆమె నుంచి స్పందన రాలేదు. కాగా సుధీర్‌కు అదే రోజు మధ్యాహ్నం 12.05 గంటలకు తన సోదరి ఆత్మహత్య చేసుకుందని ఫోన్ వచ్చింది. దీంతో అతను వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని స్రవంతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. ఇంట్లో చూసే సరికి స్రవంతి ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని కనిపించింది. కాగా అప్పటికే ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని స్రవంతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. సుధీర్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. స్రవంతి భర్త నర్సింగ్ రావు వేధింపుల వల్లే తన సోదరి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని సుధీర్ కుమార్ ఆరోపించాడు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.