శేరిలింగంపల్లి, నవంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని చందానగర్ PJR స్టేడియంలో ఉచిత మధుమేహ, రక్తపోటు, పల్స్ పరీక్షలు సిటిజన్ హాస్పిటల్స్, నల్లగండ్ల సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ 170 దేశాలలో మధుమేహ వ్యాధి వలన కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు, పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వ్యాధి సుమారు వంద కోట్ల ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతోంది. మధుమేహం మనం తీసుకునే ఆహారం నుండి ఉత్పత్తి అయ్యే గ్లూకోజును ప్రాసెస్ చేయడంలో, వినియోగించుకోవడంలో శరీరం విఫలమయ్యే రుగ్మతే డయాబెటిక్ వ్యాధి అని అన్నారు.
మారుతున్న జీవనశైలి కారణంగా దాదాపుగా ప్రతి కుటుంబంలో ఒక డయాబెటిక్ పేషంటు ఉన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఈ వ్యాధి బారిన పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉంది. ఇది సైలెంట్ కిల్లర్. శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపుతూ మనిషి ఆయుష్షును తగ్గిస్తూ ఉంది. ఇది దీర్ఘ కాలిక వ్యాధి. ఈ వ్యాధి వలన ఆర్థిక, ఆరోగ్య, ప్రాణనష్టం జురుగుతూ ఉంది. నష్టనివారణకై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), వరల్డ్ డయాబెటిక్ ఫెడరేషన్ సంయుక్తంగా వ్యాధిని అదుపులో ఉంచేందుకు అవసరమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 14వ తేదీన ఒక ప్రత్యేక నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరపు నినాదం అడ్డంకులను బద్దలు కొట్టడం – అంతరాలను తగ్గించడం . ఈ రోజున నిర్వహించడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఇన్సులిన్ మందును కనిపెట్టిన ఫ్రెడరిక్ బాంటింగ్ పుట్టిన రోజు ఈరోజు కావడం. కనుక ఆయన గౌరవార్ధం ఈరోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జిల్ మల్లేష్, ఉమా చంద్రశేఖర్, జనార్ధన్, శ్రీనివాస్ యాదవ్, MS నారాయణ, హాస్పిటల్ ప్రతినిధి జాకీర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.