సమగ్రాభివృద్ధి కోసం సర్వే: జోనల్ కమిషనర్‌ ఉపేందర్‌రెడ్డి

శేరిలింగంపల్లి , అక్టోబ‌ర్ 31 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి ): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాజిక ఆర్థిక విద్యా ఉద్యోగ రాజకీయ కుల గణనపై క్షేత్ర స్థాయిలో నవంబరు 5 నుంచి 20వ తేదీ వ‌ర‌కు ఇంటింటి సర్వేను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌ ఉపేందర్‌రెడ్డి ఆదేశించారు. సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సర్వేను నిర్వహిస్తుందని, ఇంటింటికీ వచ్చే ఎన్యుమరేటర్లకు ప్రజలు సహకరించి వివరాలను అందచేయాలని కోరారు. నవంబరు 1-20వ తేదీ వరకు జోన్‌ వ్యాప్తంగా 1,73,066 నివాసాలలో నిర్వహించాల్సిన సమగ్ర సర్వేపై జోనల్‌ కార్యాలయంలో ఎన్యుమరేటర్లతో జడ్‌సీ ఉపేందర్‌రెడ్డి సమావేశం నిర్వహించారు.

అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హిస్తున్న జోన‌ల్ క‌మిష‌న‌ర్ ఉపేంద‌ర్ రెడ్డి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోన్‌ పరిధిలోని నాలుగు సర్కిళ్లలో మొత్తం 2211 ఎన్యుమరేటర్లు ఈ సర్వేను చేపట్టి ఇంటింటి నుంచి పలు వివరాలను సేకరిస్తారన్నారు. ఇందుకు గాను వచ్చే నెల 1-4వ తేదీ వరకు ఎన్యుమరేటర్లకు సమగ్ర శిక్షణను అందించి, 5వ తేదీ నుంచి ఇంటి వద్ద తాము అందించిన ఫార్మాట్‌ ద్వారా వివరాల నమోదు చేపట్టాలని జడ్‌సీ సూచించారు. ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు , ఓటరు కార్డు సహా ఇతర పత్రాలను ప్రజలు సిద్ధంగా ఉంచుకోవాలని, ఎన్యుమరేటర్లకు సమాచారం మాత్రమే ఇవ్వాలని, ఎటువంటి జిరాక్సు ప్రతులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఒక్కో ఎన్యుమరేటరు 150 ఇండ్ల నుంచి వివరాలను సేకరించాలని, ప్రతి పది మంది ఎన్యుమరేటర్లకు ఒక పర్యవేక్ష‌కుడు ఉంటారని, వారి క్షేత్రస్థాయి వివరాల సేకరణ ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షించాలని జోనల్ కమిషనర్‌ ఉపేందర్‌రెడ్డి సూచించారు. ప్రతి ఇంటిపైనా సర్వే స్టిక్కర్‌ను అతికించాలన్నారు. సర్వే పూర్తయిన అనంతరం 25 లోగా సేకరించిన వివరాలను ఆన్‌లైన్‌ చేసే ప్రక్రియను నిర్వహించాలన్నారు. తప్పులు లేకుండా సర్వేను పూర్తి చేసి సమగ్రమైన వివరాలను సేకరించాలని జోనల్ కమిషనర్‌ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ ముకుందరెడ్డి, ఇతర అధికారులు, సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here