శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎంసీపీఐ(యూ)ఆధ్వర్యంలో ఆల్విన్ క్రాస్ రోడ్డు నుంచి మియాపూర్ క్రాస్ రోడ్డు తాండ్ర కుమార్ విగ్రహం వరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వనం సుధాకర్ మాట్లాడుతూ భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన మహత్తరమైన ప్రపంచం గర్వించదగ్గ పోరాటం వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని అన్నారు. నాటి హైదరాబాద్ స్టేట్ నిజాం సర్కార్ ఆగడాలను ఎండగడుతూ గ్రామాలలోని పటేల్ పట్వారి జాగీర్దార్ జమీందారులకు వ్యతిరేకంగా ఒడిసెలు చేతబట్టి ప్రజలు తిరుగుబాటు పోరాటాన్ని చేశారని ఈ పోరాటానికి నాటి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం భీమిరెడ్డి నరసింహారెడ్డి, మద్దికాయల ఓంకార్, లక్ష్మక్క, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల కమలమ్మ, మల్లు స్వరాజ్యం లాంటి యోధులు పోరాడారని తెలియజేశారు.
వెట్టి చాకిరి విముక్తి కోసం నాటి నిజాం పాలనకు గోరి కట్టడానికి కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు ప్రజా తిరుగుబాటుతో భూస్వాముల భూములను 10 లక్షల ఎకరాలను ప్రజలకు పంపిణీ చేయబడ్డదని 3000 గ్రామాలు గ్రామ స్వరాజ్యాలుగా పరిపాలన చేయబడ్డాయని ఈ మహత్తర పోరాటంలో 4,000 మంది అమరులు వీరమరణం పొందారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యుడు పల్లె మురళి, కార్యదర్శి మైదం శెట్టి రమేష్, కార్యదర్శివర్గ సభ్యులు కుంభం సుకన్య, తాండ్ర కళావతి, కమిటీ సభ్యులు అంగడి పుష్ప, కర్ర దానయ్య, బి.విమల, మియాపూర్ డివిజన్ కమిటీ సభ్యులు జి.శివాని, వి.అనిత, బుసాని రవి, ఎన్.నాగభూషణం, శంకర్, డి శ్రీనివాసులు, చైతన్య, అమీనా, టి.నర్సింగ్, శరణప్ప తదితరులు పాల్గొన్నారు.